ద్విచక్ర వాహనంపై యథేచ్ఛగా రేషన్ బియ్యం తరలింపు?
కళ్లముందే దందా.. అధికారుల నిఘా ఎక్కడంటున్న స్థానికులు
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 11:
నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతోందన్న ఆరోపణలు గార్ల మండలంలో చర్చనీయాంశంగా మారాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా ఇస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది గార్ల మండల కేంద్రంలో ఓ వ్యక్తి నిర్భయంగా స్కూటర్‌పై రేషన్ బియ్యం బస్తాలను తరలిస్తున్న దృశ్యం స్థానికంగా కనిపించడంతో అక్రమ రవాణాపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అక్రమంగా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న బియ్యం బస్తాలు
స్కూటర్‌పై రేషన్ బియ్యం బస్తాలను తరలిస్తున్న వ్యక్తి కదలికలు స్థానికుల దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా వ్యక్తిగత అవసరాల కోసం తీసుకెళ్లే పరిమాణానికి భిన్నంగా బియ్యం బస్తాలను తరలిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి సేకరించారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే విషయాలపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
నిరుపేదల బియ్యంపై దళారుల కన్ను?
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు కేసులు నమోదు చేసి, నిల్వలను స్వాధీనం చేసుకున్నప్పటికీ అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు రేషన్ బియ్యం దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరుగా కొనసాగిస్తున్నారు.
అక్రమార్కులపై అధికారుల నిఘా ఏదీ?
మండలంలో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణాపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా బియ్యం తరలించే వారిపై తనిఖీలు చేపట్టాలని అంటున్నారు.స్కూటర్‌పై బియ్యం తరలిస్తున్న వ్యక్తి విషయంలోనూ అధికారులు వాస్తవాలను నిర్ధారించి, బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్తుందో విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకోవాలి
రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కేవలం రవాణా చేసే వ్యక్తులపైనే చర్యలు తీసుకోవడం కాకుండా.. బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వారు, నిల్వ చేస్తున్న వారు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారి వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి బలికాకుండా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్న సదరు రేషన్ డీలర్లతోపాటు అక్రమంగా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

