Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నండీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి శాంతియుత నిరసనలను అణచివేయడం దారుణం: వైఎస్సార్‌సీపీ

డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి శాంతియుత నిరసనలను అణచివేయడం దారుణం: వైఎస్సార్‌సీపీ

డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి

శాంతియుత నిరసనలను అణచివేయడం దారుణం: వైఎస్సార్‌సీపీ

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, ఆగస్టు 12: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర, స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) డిమాండ్ చేశారు. మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని కృష్ణ తెలిపారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసు వ్యవస్థను ఉపయోగించి అణచివేతకు పాల్పడటం దారుణమన్నారు.

డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, న్యాయ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. స్వతంత్ర విచారణకు అవకాశం కల్పించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

శాంతియుత నిరసన కార్యక్రమాలపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాయడం సరికాదన్నారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాల ఆందోళనలను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.

రాజమండ్రిలో వైద్యుడి మృతికి సంబంధించిన ఘటనపైనా ప్రభుత్వం సమగ్రంగా స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కృష్ణ కోరారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేసి పూర్తి సమాచారాన్ని వెల్లడించాలన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ఆక్వా రైతులు తదితర అనేక వర్గాలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం ప్రజా సమస్యలను విస్మరించడమేనని విమర్శించారు. ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతోందన్నారు.

డీఎస్సీ అక్రమాలపై వెంటనే సమగ్ర, స్వతంత్ర న్యాయ విచారణకు ప్రభుత్వం అంగీకరించాలని, శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసు అణచివేతను నిలిపివేయాలని బి.ఎస్. కృష్ణ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular