ఐదేళ్ల పదవీకాలానికి ముగింపు పలికిన కాజులూరు మండల పరిషత్ పాలకవర్గం
సాదాసీదాగా తుది సర్వసభ్య సమావేశం.. అభివృద్ధి పనులపై సమీక్ష
కాజులూరు, పెన్పవర్, సెప్టెంబర్ 17:
కాజులూరు మండల పరిషత్ పాలకవర్గానికి ఘన వీడ్కోలు పలికారు. ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 23తో ముగియనున్న నేపథ్యంలో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో తుది సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మాత భారతి దంపతులతో పాటు జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలను మండల పరిషత్ సభ్యులు, రాజకీయ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు శాలువాలు, జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు.
ఎంపీపీ మాత భారతి అధ్యక్షతన, ఎంపీడీవో జె. రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. మండల వ్యవసాయ అధికారి వి. అశోక్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను సక్రమంగా సరఫరా చేసినట్లు తెలిపారు. కొత్త బడ్జెట్ మంజూరైతే రైతులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
హౌసింగ్ ఇన్చార్జి, చేదువాడ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రసన్న మాట్లాడుతూ కొత్త హౌసింగ్ పథకానికి సంబంధించి 96 మంది అర్హత పొందగా, 21 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అర్హులైన వారు ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఈవో జాన్ మాట్లాడుతూ మండలానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయని తెలిపారు.
పంచాయతీరాజ్ మండల జేఈ భవానీ శంకర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ప్రధాన పనుల్లో చాలా వరకు పూర్తి చేసినట్లు, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ జేఈ రూప మాట్లాడుతూ మరో పది రోజుల్లో గొల్లపాలెం ఆర్వో ప్లాంట్ను ప్రారంభించే అవకాశం ఉందని, దీంతో మండలంలోని తాగునీటి సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను బిల్లులు వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు.
వెలుగు ఏపీఎం టి. మురళీకృష్ణ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలకు ఇప్పటివరకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.28 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.8 కోట్లు, ఉన్నతి పథకం ద్వారా రూ.34 లక్షల రుణాలు అందించినట్లు తెలిపారు.
దుగ్గుదూరు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ స్వాతి మాట్లాడుతూ మైనార్టీ తీరని బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వివాహాలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించకూడదని సూచించారు. టీనేజీ బాలికలకు సంబంధించి ఏడు గర్భధారణ కేసులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పల్లిపాలెం ఎంపీటీసీ గ్రామాల్లో ఇటువంటి విషయాలపై సమాచారం అందించినప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణంపై వివరించారు. జగన్నాధగిరిలో నిర్మించిన అంగన్వాడీ భవనానికి తలుపులు ఏర్పాటు చేయలేదని ఎంపీటీసీ లక్ష్మి కొప్పన ప్రశ్నించారు. నిధుల కొరత కారణంగా పనులు పూర్తికాలేదని ఎంపీడీవో జె. రాంబాబు, సూపర్వైజర్ రమణకుమారి వివరించారు.
పాలకవర్గానికి ఆత్మీయ వీడ్కోలు
తమ ఐదేళ్ల పదవీకాలంలో గ్రామాల అభివృద్ధికి సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి ఎంపీపీ మాత భారతి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాత మురళీ మాట్లాడుతూ ఐదేళ్ల పదవీకాలాన్ని సజావుగా కొనసాగించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని, పార్టీలకు అతీతంగా ఎవరికైనా సమస్యలు ఎదురైతే తమను సంప్రదించవచ్చని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ వనుం వెంకట సుబ్బారావు, వైస్ ఎంపీపీలు పెద్దిరెడ్డి వెంకటరమణ, రేఖాడి విజయ, మంజేరు ఎంపీటీసీ గండి మణికంఠ, ఉప్పుమిల్లి ఎంపీటీసీ కృష్ణమూర్తి, చేదువాడ ఎంపీటీసీ ఆనాల సీత, మతుకుమిల్లి ఎంపీటీసీ గొల్లపల్లి సింహాద్రి తదితరులు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు పూర్తికాక కొన్ని పనులు నిలిచిపోయాయని, వాటికి బిల్లులు మంజూరు చేయాలని ఎంపీడీవోను కోరారు. బడ్జెట్ అందిన వెంటనే పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.
అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంపీపీ మాత భారతి దంపతులు, జెడ్పీటీసీ వనుం వెంకట సుబ్బారావు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలను మండల పరిషత్ సభ్యులు, రాజకీయ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు. ఐదేళ్ల పాలనకు ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది.

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

