పాల్గొన్న సభాపతి అయ్యన్నపాత్రుడు దంపతులు
భూగర్భ జలాల పెంపే లక్ష్యం
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నంలోని శ్రీదుర్గా మల్లేశ్వరి ఆలయంలో మంగళవారం ‘వరుణయాగం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీరితోపాటు వారి తనయుడు, టిడిపి నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి కరువు రాకుండా భూగర్భ జలమట్టాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వరుణ యాగాలను చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది ఏలినో ప్రభావం వలన ఆరంభంలో వర్షాలు ఆలస్యమవ్వడం వల్ల రైతులు కొంత ఇబ్బంది పడ్డారని, 70 శాతం నాట్లు పూర్తికాగా, మిగిలిన 30 శాతానికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. తుఫానుల వల్ల పడిన వర్షాలతో కరువు గండం నుంచి బయటపడినప్పటికీ, శాస్త్రవేత్తల సూచనల మేరకు భూగర్భంలో నీటి నిల్వలను పెంచుకోవడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. అలాగే నర్సీపట్నం ప్రాంతంలో భూగర్భ జలాలు స్థిరంగా ఉండేందుకు, తాగునీటి సమస్య తీర్చేందుకు అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా రావణాపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ యాగం ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వేద పండితులకు, దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ కమిటీ సభ్యులకు, టిడిపి నాయకులకు మరియు భక్తులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

