Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నం మున్సిపాలిటీలో చింతకాయల పద్మావతి విస్తృత ప్రచారం

నర్సీపట్నం మున్సిపాలిటీలో చింతకాయల పద్మావతి విస్తృత ప్రచారం

– ‘చెప్పామంటే చేస్తాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం’

– వార్డుల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతికి అపూర్వ స్వాగతం

​నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వార్డుల్లో నాయకులు, కార్యకర్తల విస్తృత పర్యటనలతో ఎన్నికల సందడి నెలకొంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 39, 40వ వార్డుల పరిధిలోని గచ్చపు వీధి, అయ్యన్న కాలనీల్లో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి నాయకులతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతికి వార్డు మహిళలు హారతులు పట్టి, పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఆమె ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. చెప్పామంటే చేస్తాం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం అని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ ప్రచారంలో నాయకులు డబ్బీరు శ్రీకాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డుల్లో మంజూరైన పనుల టెండర్లను సైతం రద్దు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందన్నారు. అనంతరం చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబ్బులిస్తే కానీ పనులు జరగని దౌర్భాగ్య స్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే కేవలం 28 రోజుల్లోనే గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడి చొరవతో రూ.4.11 కోట్ల వీఎంఆర్‌డీఏ నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చారని తెలిపారు. నర్సీపట్నంలో ఒకప్పుడు చెత్త కూడా ఎత్తలేని దుస్థితి ఉండేదని, ఆ పరిస్థితిని ఇప్పుడు సమూలంగా మార్చేశామని పద్మావతి అన్నారు. స్పీకర్ చొరవతో రూ.2 కోట్లు వెచ్చించి 3 టన్నుల చెత్తను జిందాల్ కంపెనీకి తరలించేలా ఏర్పాటు చేశామన్నారు. మరో రూ.3 కోట్లతో చెత్త శుద్ధి, వర్మీ కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 28 వార్డుల అభివృద్ధికి రూ.267.70 కోట్లు తీసుకొచ్చామని, పార్టీలకతీతంగా పనులు చేపట్టామని స్పష్టం చేశారు. 39, 40 వార్డులకే రూ.6.63 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రూ.185 కోట్లతో ఇంటింటికీ కుళాయి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిలోగా ప్రతి ఇంటికీ తాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular