దేశీయ విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా ఎంచుకునే అవకాశం కల్పించే కొత్త నిబంధనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఎయిర్‌లైన్స్ సంస్థల ఒత్తిడి, టికెట్ ధరలపై ప్రభావం ఉంటుందన్న వాదనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన నిబంధన చివరి క్షణంలో వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం చాలా ఎయిర్‌లైన్స్ 20 శాతం కన్నా తక్కువ సీట్లనే ఉచితంగా అందిస్తున్నాయి. ప్రయాణికుల ఫిర్యాదులు ఉన్నప్పటికీ పాత విధానమే కొనసాగనుంది.
- 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనకు బ్రేక్
- ఎయిర్‌లైన్స్ ఒత్తిడికి కేంద్రం వెనక్కి..
- టికెట్ ధరల సమతుల్యతపై సంస్థల ఆందోళన
- ప్రస్తుతం 20 శాతం కంటే తక్కువ ఫ్రీ సీట్లు
- ఒకే PNR ప్రయాణికులకు కలిసిన సీట్లు కొనసాగింపు
న్యూస్ డెస్క్ | పెన్ పవర్ | ఏప్రిల్ 05:
దేశీయ విమానాల్లో మొత్తం సీట్లలో కనీసం 60 శాతం వరకు అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులు స్వయంగా ఎంచుకునే అవకాశం కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనను ఉపసంహరించుకుంది. ఈ నిబంధన ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, విమానయాన సంస్థల ఒత్తిడితో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఆకాసా ఎయిర్ కూడా ఈ నిర్ణయాన్ని పునర్విచారించాలని కేంద్రాన్ని కోరాయి. ఈ నిబంధన అమలైతే టికెట్ ధరల రూపకల్పన దెబ్బతింటుందని, ఆదాయంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని సంస్థలు వాదించాయి. ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. అయితే ఒకే PNR నంబర్‌పై ప్రయాణించే కుటుంబ సభ్యులు లేదా గుంపులకు దగ్గర దగ్గరగా సీట్లు కేటాయించాలన్న సూచన మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. ప్రస్తుతం చాలా విమానయాన సంస్థలు ఆన్‌లైన్ చెక్-ఇన్ సమయంలో 20 శాతం కన్నా తక్కువ సీట్లను మాత్రమే ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. మిగిలిన సీట్లకు రూ.150 నుంచి రూ.2,000 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రయాణికులు సీటు ఎంపిక చేయకపోతే చివరి క్షణంలో ఆటోమేటిక్‌గా సీట్లు కేటాయించే విధానం కొనసాగుతోంది. ఈ విధానంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురావాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి పాత విధానమే అమల్లో ఉంటుంది.

