ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిరాజమండ్రిలో భారీ ఈవెంట్

రాజమండ్రిలో భారీ ఈవెంట్

ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం ప్రపంచ స్థాయి బోట్ రేసింగ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. మే నెలలో గోదావరిలో మూడు రోజుల పాటు డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు జరగనున్నాయి. 25 దేశాల నుంచి 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం ఈ ఈవెంట్ ప్రత్యేకత. భారత్‌లో ఈ స్థాయి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ రేసింగ్ జరగడం ఇదే తొలిసారి. టూరిజం, పుష్కరాల అభివృద్ధికి ఈ ఈవెంట్ కీలక మైలురాయిగా మారనుంది.

  • గోదావరిలో మూడు రోజుల అంతర్జాతీయ పోటీలు
  • 25 దేశాల నుంచి 1200 మంది క్రీడాకారులు
  • ఇండియాలో తొలిసారి డ్రాగన్ బోట్ లీగ్
  • టూరిజం అభివృద్ధికి ప్రభుత్వ భారీ ప్రణాళికలు
  • మే 30 నుంచి మెన్, విమెన్, మిక్స్డ్ కేటగిరీల్లో పోటీలు

రాజమండ్రి, పెన్ పవర్ , ఏప్రిల్ 7:

రాజమహేంద్రవరం మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. గోదావరి నదిపై డ్రాగన్ బోట్ రేసింగ్ 2026 పేరుతో ప్రపంచ స్థాయి బోట్ రేసింగ్ ఈవెంట్ మే నెలలో మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైనా ప్రాచీన క్రీడగా పేరుగాంచిన డ్రాగన్ బోట్ రేసింగ్‌ను భారత్‌లో ఈ స్థాయిలో నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పోటీల్లో 25 దేశాలకు చెందిన 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననుండగా, ఇప్పటికే 12 దేశాలు తమ భాగస్వామ్యాన్ని ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెన్, విమెన్, మిక్స్డ్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మే 30 నుంచి మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. రాజమండ్రిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో పలు ఈవెంట్లను ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో డ్రాగన్ బోట్ రేసింగ్ వంటి అంతర్జాతీయ క్రీడా వేడుకలు రాజమండ్రి ప్రతిష్టను మరింత పెంచనున్నాయి. ఈవెంట్‌కు సంబంధించిన లోగో, షెడ్యూల్, డ్రెస్ కోడ్‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలను మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular