డీఎంహెచ్ఓ డా. సరిత
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 8:
క్షయ వ్యాధి (టిబి) నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన “టీబీ ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా పెదగెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగరం, వాల్మీకి పేట, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. సరిత మాట్లాడుతూ దేశం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో గ్రామస్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.శిబిరంలో ఆధునిక హ్యాండ్ హెల్డ్ ఎక్స్-రే పరికరం ద్వారా 14 సంవత్సరాల పైబడిన వారికి ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహించగా, ఏఐ సాంకేతికత ద్వారా ఒక గంటలోనే ఫలితాలు అందజేస్తున్నామని వివరించారు. మొత్తం 75 మందికి ఎక్స్-రే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.క్షయ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తూ, రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రూనాట్ , సిబినాట్ యంత్రాల ద్వారా ఉచితంగా కఫం పరీక్షలు నిర్వహిస్తున్నామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా మందులు అందజేస్తున్నామని చెప్పారు. అదనంగా, చికిత్స సమయంలో పౌష్టికాహారం కోసం నెలకు రూ.1000 చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు.అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సత్యనారాయణ, ఎస్టీఎల్ఎస్ వంశీధర్, ఎంఎల్హెచ్‌పీలు కే. ప్రసన్న, ఎం. విజయకుమారి, ఎస్. సునీత క్రేజ తదితరులు పాల్గొన్నారు.

