ఆదర్శంగా నిలుస్తున్న దుమంతి సత్యనారాయణ
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14: అందరూ చదవాలి, అందరూ ఎదగాలన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా గూడెం కొత్తవీధి ఉప తహసీల్దార్ దుమంతి సత్యనారాయణ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. నిరుపేద గిరిజన నిరుద్యోగ యువతకు వేల రూపాయల విలువైన గ్రూప్స్ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందజేసి ఆయన తన ఉదారతను చాటుకున్నారు.అల్లూరి జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన దుమంతి సత్యనారాయణ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం జీకే వీధి మండల రెవెన్యూ ఉప తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణతో పాటు సెలవు దినాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా జీకే వీధి మండలం దుచ్చరపాలెం గ్రామానికి చెందిన పలాస బాలకృష్ణ, పెదపాడు గ్రామానికి చెందిన సిందేరి సురేష్, తోకరాయి గ్రామానికి చెందిన రెడ్డి సంజీవరావు అనే ముగ్గురు పేద గిరిజన విద్యార్థులకు గ్రూప్-1, గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సహాయం వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను కూడా చదివిస్తూ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు.నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న ఉప తహసీల్దార్ సత్యనారాయణను పలువురు అభినందిస్తున్నారు.

