చింతూరు నాన్ ఎస్టీ పీడీఎఫ్‌లకు ఐటీడీఏలో నిర్వహణ
చింతూరు, పెన్ పవర్ మే 20:
చింతూరు గ్రామానికి చెందిన నాన్ ఎస్టీ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల (పిడిఎఫ్స్) పునరావాస ప్రక్రియలో భాగంగా తాడువాయి గ్రామంలో బ్లాక్‌ల ఖరారు లాటరీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11 గంటలకు ఐటీడీఏ చింతూరు కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. మొదటి, రెండవ డ్రాఫ్ట్ స్కీమ్‌లలో ఉన్న నాన్ ఎస్టీ పీడీఎఫ్‌లకు బ్లాక్‌ల ఎంపికను పారదర్శక విధానంలో లాటరీ ద్వారా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పునరావాస కార్యక్రమాన్ని వేగవంతంగా, న్యాయబద్ధంగా అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ వారీ లైన్ లిస్టులు, అర్హుల వివరాలు, ఎంపిక విధానం తదితర అంశాలను సమావేశంలో వివరించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంబంధిత కుటుంబాల వివరాలను సేకరించి, డ్రాఫ్ట్ స్కీమ్‌ల ప్రకారం జాబితాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రతి అర్హ కుటుంబానికి సమాన అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పునరావాస ప్రక్రియలో పారదర్శకత, సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. మొదట ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం వేదికను మార్చి ఐటీడీఏ చింతూరు కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొదటి మరియు రెండవ డ్రాఫ్ట్ స్కీమ్‌లలో ఉన్న అన్ని నాన్ ఎస్టీ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు తప్పనిసరిగా హాజరై తమ వివరాలను ధృవీకరించుకోవాలని ప్రాజెక్ట్ అధికారి విజ్ఞప్తి చేశారు.

