ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిఅయ్యన్న వారసులకు లైన్ క్లియర్..!

అయ్యన్న వారసులకు లైన్ క్లియర్..!

📰 Generate e-Paper Clip

పెద్ద కుమారుడికి రాజ్యసభ.. చిన్న కుమారుడికి అసెంబ్లీనా..?
రాజకీయ విరమణపై అయ్యన్న స్పష్టమైన సంకేతాలు
రాజ్యసభ ఎంపికతో విజయ్ రాజకీయ స్థాయి మరింత పెరుగుదల
నర్సీపట్నం అభ్యర్థిత్వంపై కొత్త సమీకరణాలు
రాజేష్ వైపు మొగ్గు చూపుతున్న స్థానిక శ్రేణులు
అయ్యన్న కుటుంబానికి టికెట్ తప్పదనే పార్టీ వర్గాలు
తండ్రి కలను సాకారం చేసే దిశగా ఇద్దరు కుమారులు

నర్సీపట్నం రాజకీయాల్లో వారసత్వ చర్చ జోరందుకుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ విరమణ సంకేతాలు ఇవ్వడంతో ఆయన తర్వాత నియోజకవర్గ బాధ్యతలు ఎవరు చేపడతారన్న ఆసక్తి పెరిగింది. పెద్ద కుమారుడు విజయ్ రాజ్యసభకు వెళ్లడంతో, రెండో కుమారుడు రాజేష్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశాలపై తెలుగుదేశం శ్రేణుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అయ్యన్న వారసులకు లైన్ క్లియర్..! పెద్ద కుమారుడికి రాజ్యసభ.. చిన్న కుమారుడికి అసెంబ్లీనా..?

అనకాపల్లి, పెన్ పవర్ జూన్ 9 :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గం ప్రత్యేక చర్చకు కేంద్రబిందువుగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్న సీనియర్ తెలుగుదేశం నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పలుమార్లు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో ఆయన రాజకీయ వారసత్వంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించడంతో నర్సీపట్నం భవిష్యత్ నాయకత్వంపై ఆసక్తి మరింత పెరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే జెండా కింద కొనసాగుతూ వచ్చిన అయ్యన్నపాత్రుడు పార్టీకి అత్యంత విధేయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కోసం తనదైన శైలిలో పోరాడిన ఫైర్‌బ్రాండ్ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్న నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల నుంచి ఆయన వైదొలగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు అయ్యన్న రాజకీయ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు చింతకాయల విజయ్ పేరు ప్రధానంగా వినిపించింది. పార్టీ యువ విభాగం ఐటీడీపీలో కీలక పాత్ర పోషించిన విజయ్, వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎదురైన రాజకీయ ఒత్తిళ్లు, కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూ పార్టీకి అండగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆయనకు ఇటీవల రాజ్యసభ సభ్యత్వం లభించింది. అయితే విజయ్ రాజ్యసభకు వెళ్లడంతో నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్థిత్వంపై కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆరు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. 2029 ఎన్నికల సమయానికి విజయ్ పదవీకాలంలో ఇంకా మూడేళ్లు మిగిలి ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పటికైతే స్పష్టత లేని అంశంగా మారింది.

ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు రాజేష్ పేరు ముందుకు వస్తోంది. ప్రస్తుతం నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగుతున్న రాజేష్ స్థానిక రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా ఆయనకు అనుకూల వాతావరణం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో 2029 ఎన్నికల్లో రాజేష్‌ను తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టు, కార్యకర్తలతో ఉన్న అనుబంధం దృష్ట్యా కుటుంబానికి కాకుండా ఇతర నేతకు టికెట్ ఇస్తే శ్రేణులు పూర్తిస్థాయిలో సహకరిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే వారసత్వ రాజకీయాలపై పార్టీ అధిష్టానం కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఒకవేళ రాజకీయ సమీకరణాలు అనుకూలిస్తే పెద్ద కుమారుడు విజయ్ జాతీయ రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, చిన్న కుమారుడు రాజేష్ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. అలా జరిగితే ఇద్దరు కుమారుల రాజకీయ భవిష్యత్తును ఒకేసారి గాడిలో పెట్టిన నాయకుడిగా అయ్యన్నపాత్రుడు నిలిచిపోతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ అంచనాలే అయినప్పటికీ, నర్సీపట్నం రాజకీయాల భవిష్యత్తుపై చర్చకు మాత్రం అయ్యన్న కుటుంబమే కేంద్రంగా మారిందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular