Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినక్కపల్లి వారపు సంతలో చిరు వ్యాపారుల కష్టాలకు చెక్

నక్కపల్లి వారపు సంతలో చిరు వ్యాపారుల కష్టాలకు చెక్

నక్కపల్లి వారపు సంతలో చిరు వ్యాపారుల కష్టాలకు చెక్

రూ.60 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన దుకాణ సముదాయం ప్రారంభం

 

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్              నక్కపల్లి, ఆగస్టు 13: నక్కపల్లి వారపు సంతలో చిరు వ్యాపారుల కష్టాలకు తెరపడింది. జాతీయ రహదారికి ఆనుకుని ప్రతి శుక్రవారం నిర్వహించే వారపు సంతలో రూ.60 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన పక్కా దుకాణ సముదాయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం ప్రారంభించారు.

నక్కపల్లి వారపు సంతకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏళ్లుగా వ్యాపారులు పాకలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు, కిరాణా సరుకులు, ఎండుచేపలు తదితర వస్తువులను విక్రయిస్తున్నారు. వర్షాకాలంలో సంత ప్రాంగణం బురదమయంగా మారడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత ఏడాది సంభవించిన అగ్ని ప్రమాదంలో సంతలోని పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు హోంమంత్రి అనితను కలిసి పక్కా దుకాణ సముదాయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాపారుల సమస్యపై స్పందించిన మంత్రి చొరవతో హెటెరో సంస్థ రూ.60 లక్షల సీఎస్ఆర్ నిధులను కేటాయించింది. ఈ నిధులతో మూడు బ్లాకుల్లో మొత్తం 65 దుకాణాలతో పక్కా మార్కెట్ సముదాయాన్ని నిర్మించారు.

తాజాగా హోంమంత్రి అనిత దుకాణ సముదాయాన్ని ప్రారంభించి చిరు వ్యాపారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారులు, కొనుగోలుదారులకు ఈ మార్కెట్ సముదాయం 40 ఏళ్ల కల అని పేర్కొన్నారు. నక్కపల్లి అతిపెద్ద ఎండుచేపల మార్కెట్‌గా గుర్తింపు పొందిందని తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మత్స్యకారులు, వ్యాపారులు నక్కపల్లి సంతకు వచ్చి ఎండుచేపల కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహిస్తుంటారని చెప్పారు.

సీఎస్ఆర్ నిధులతో మార్కెట్ సముదాయం నిర్మాణానికి సహకరించిన హెటెరో సంస్థ యాజమాన్యాన్ని హోంమంత్రి అనిత అభినందించారు. పక్కా దుకాణ సముదాయం అందుబాటులోకి రావడంతో చిరు వ్యాపారులకు వర్షం, ఎండతో పాటు అగ్ని ప్రమాదాల భయం కూడా తగ్గి వ్యాపారాలకు మరింత సౌకర్యం కలగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular