ఎల్బీనగర్, పెన్ పవర్ సెప్టెంబర్ 12:
రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1.65 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. వివిధ రకాల రాజీకి అనుకూలమైన కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరంగా పరిష్కరించారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ (డి.ఎస్.ఎల్.ఏ) చైర్మన్ కర్ణ కుమార్, I అదనపు జిల్లా జడ్జి వినోద్ కుమార్, IV అదనపు జిల్లా జడ్జి కె. జయరాం రెడ్డి, డి.ఎస్.ఎల్.ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి. డి.ఎస్.ఎల్.ఏపవన్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 33 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ, ప్రీ-లిటిగేషన్ తదితర రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరించారు. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఓ దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించగా, వారి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి తిరిగి కలిసి జీవించేందుకు అంగీకరించారు. దీంతో ఒక కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడినట్లయింది. అదేవిధంగా శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్.డి.ఎఫ్.సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించిన మోటారు వాహన ప్రమాద కేసుల్లో బాధితులకు రూ.80 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, సివిల్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ, ప్రీ-లిటిగేషన్ తదితర కేసులు కలిపి సుమారు 1,65,000కు పైగా కేసులు పరిష్కరించబడ్డాయి. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.10,03,33,111 నష్టపరిహారాన్ని కక్షిదారులకు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్యానెల్ న్యాయవాదులు, డి.ఎస్.ఎల్.ఏ సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు తమ సహాయ సహకారాలు అందించారు.

