ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 12:
ఇబ్రహీంపట్నం మున్సిపల్ శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన 30 గంటల హ్యాకథాన్–2026 శుక్రవారం, శనివారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముందు నాలుగు రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక బూట్‌క్యాంప్ నిర్వహించి ఆధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ అందించారు. కళాశాల ఛైర్మన్ ఆర్. వెంకట్రావు, కార్యదర్శి ఆర్. అనుప్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్‌లో సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొని 92 ప్రాజెక్టులను రూపొందించారు. ఐడెంటిటీ ఏఐ, డేటా సైన్స్, ఏజెంటిక్ ఏఐతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులు, మహిళల భద్రత, సామాజిక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలపై వినూత్న ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. 30 గంటల పాటు బృందాలుగా పనిచేసిన విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించారు. టీసీఎస్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, క్యాప్‌జెమినీ తదితర సంస్థల మేనేజర్లు, సాంకేతిక నిపుణులు ప్రాజెక్టులను పరిశీలించి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. విజేతలకు ప్రైజ్‌మనీ అందజేశారు. విద్యార్థులు రూపొందించిన ఉత్తమ ప్రాజెక్టులను వాస్తవ జీవితంలో అమలు చేసేందుకు పరిశ్రమల ప్రతినిధులు సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వం అందించేందుకు ముందుకు వచ్చారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడమే హ్యాకథాన్ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

