లోన్ యాప్ వేధింపులు
కానిస్టేబుల్ బలవన్మరణం
రూ.40 వేల అప్పు కోసం అసభ్యకర బెదిరింపులు
నగ్న చిత్రాలు పంపుతామంటూ వేధింపులు
హైదరాబాద్, పెన్ పవర్, నవంబర్ 10:
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మరో నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో చేసిన బెదిరింపులు తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్‌లోని కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీను (31) నాలుగు నెలల క్రితం ఓ లోన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. సకాలంలో వాయిదాలు చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ప్రారంభమైనట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు నగ్న చిత్రాలు పంపిస్తామంటూ అసభ్యకరంగా బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సులభంగా రుణాలు ఇస్తామంటూ ఆకర్షించి, ఆ తర్వాత వేధింపులకు పాల్పడుతున్న లోన్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

