ఇందిరానగర్, ఎన్ఎస్టిఎల్ రోడ్ విస్తరణ పనుల పరిశీలన
కాంట్రాక్టర్కు ఆరు రోజుల గడువువిచ్చిన ఎమ్మెల్యే గణబాబు
విశాఖ పశ్చిమ, పెన్ పవర్, జూలై 2 : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ఇందిరానగర్ నుంచి ఎన్ఎస్టిఎల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్న ఆయన, ఈ నెల 28న జరిగే ప్రతిష్టాత్మక సింహాచలం గిరిప్రదక్షిణ నాటికి రహదారి పనులు పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యతతో పాటు వేగంపైనా ప్రత్యేక దృష్టి సారించిన గణబాబు, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే రాత్రింబవళ్లు పనిచేసి గిరిప్రదక్షిణకు ముందు రహదారిని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
రిటైనింగ్ వాల్ పనులపై అసంతృప్తి.. : పనులు ఆలస్యమైతే భక్తులు ఇబ్బందులు పడతారని హెచ్చరిక చేశారు. పరిశీలన సందర్భంగా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంపై ప్రభుత్వ విప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, మరో ఆరు రోజుల్లోగా అన్ని పనులు పూర్తి చేయాలని కఠినమైన గడువు విధించారు. గిరిప్రదక్షిణ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ మార్గంలో ప్రయాణించే అవకాశం ఉన్నందున, పనులు పూర్తికాకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. భక్తుల సౌకర్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న గణబాబు, ఈ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదా ఆలస్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

