ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిగోదారోళ్లు... ఆ మాత్రం ఉండాల్సిందే...

గోదారోళ్లు… ఆ మాత్రం ఉండాల్సిందే…

📰 Generate e-Paper Clip

సిద్ధాంతం సభలో సీఎం వ్యాఖ్యలు వైరల్
భూముల సేకరణలో గోదావరి జిల్లాల ప్రత్యేక ధోరణి
వ్యవసాయం, ఆక్వాతో పెరిగిన భూముల విలువ
రవాణా సౌకర్యాలతో మరింత డిమాండ్
నగరీకరణ, రియల్ ఎస్టేట్ బూమ్ ప్రభావం
పెట్టుబడులకు ఆకర్షణగా ఉభయ గోదావరి జిల్లాలు
గోదారోళ్ల భూములపై చంద్రబాబు కామెంట్.. రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ
“సెంటు భూమి కూడా ఇవ్వరు”.. గోదావరి జిల్లాల ప్రత్యేకతను చెప్పిన సీఎం వ్యాఖ్యలు

పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తుంటే.. గోదావరి జిల్లాల్లో మాత్రం భూమి ఇవ్వడంపై వెనుకంజ వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక గోదావరి ప్రాంత భూముల విలువ, వ్యవసాయ సుసంపన్నత, ఆక్వా రంగ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ విస్తరణ వంటి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గోదావరి జిల్లాల ఆర్థిక బలం, భూమిపై ఉన్న భావోద్వేగ అనుబంధమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, రాజమండ్రి, జూన్ 9:

“గోదారోళ్లు… ఆ మాత్రం ఉండాల్సిందే” అనే వ్యాఖ్య ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజల్లో వినిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చకు దారితీశాయి. విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారని, కానీ గోదావరి జిల్లాల్లో సెంటు భూమి కూడా ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరని సీఎం వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వ్యాఖ్యల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే గోదావరి జిల్లాల ప్రత్యేక ఆర్థిక నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములు కలిగిన ప్రాంతంగా ఉభయ గోదావరి జిల్లాలు పేరుగాంచాయి. గోదావరి డెల్టా పరిధిలో వరి సాగుతో పాటు కొబ్బరి, పండ్ల తోటలు, చేపలు, రొయ్యల పెంపకం వంటి రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయి. ఫలితంగా వ్యవసాయ భూములు కేవలం ఆస్తులుగా కాకుండా నిరంతర ఆదాయ వనరులుగా మారాయి.ప్రత్యేకించి ఆక్వాకల్చర్ రంగం గోదావరి ప్రాంత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. రొయ్యల చెరువులు, చేపల పెంపకం ద్వారా భారీ ఆదాయాలు వస్తుండటంతో రైతులు తమ భూములను విక్రయించడానికి లేదా ఇతర అవసరాల కోసం విడిచిపెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ భూమి కలిగి ఉండటం ఒక ఆర్థిక భద్రతగా భావించే పరిస్థితి నెలకొంది.
ఇక రవాణా సౌకర్యాలు కూడా భూముల ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ప్రధాన రైల్వే మార్గాలు గోదావరి జిల్లాల మీదుగా విస్తరించి ఉండటంతో వాణిజ్య అవకాశాలు పెరిగాయి. రహదారులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎకరాకు కోట్ల రూపాయల విలువ పలుకుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.మరోవైపు కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, అమలాపురం, పాలకొల్లు వంటి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కొత్త లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు ఏర్పడటంతో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. దీంతో వ్యవసాయ భూములు కూడా పెట్టుబడి కోణంలో విలువైన ఆస్తులుగా మారాయి.
గత కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగ, వ్యాపారాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విదేశాలకు వెళ్లిన గోదావరి ప్రాంత ప్రజలు తిరిగి స్వగ్రామాల్లో భూములు కొనుగోలు చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు తోడు ప్రవాస గోదావరి వాసుల పెట్టుబడులు చేరడంతో భూముల విలువలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలను కొందరు సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు గోదావరి ప్రాంత ఆర్థిక బలానికి గుర్తింపుగా భావిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధికి భూముల లభ్యత ఒక సవాలుగా మారుతున్నప్పటికీ, రైతులు తమ భూములపై చూపుతున్న అనుబంధం, భూమి ద్వారా లభిస్తున్న ఆదాయం గోదావరి జిల్లాల ప్రత్యేకతగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular