ఆకట్టుకుంటున్న సంప్రదాయ నృత్యాలు
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16:
గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండాలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న తీజ్ పండుగ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగాయి. తీజ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా గిరిజన భక్తజనం సంత్ సేవాలాల్ మహారాజ్, మేరమా యాడీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, గ్రామాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, పెళ్లికాని యువతీ యువకులకు మంచి సంబంధాలు కుదరాలని, ప్రపంచ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తీజ్ పండుగలో భాగంగా తొమ్మిది రోజుల పాటు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన కార్యక్రమాలతో తండాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.ఈకార్యక్రమానికి తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగావత్ శ్రీనివాస్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను తరతరాలకు అందించడంలో తీజ్ పండుగకు విశిష్ట స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ రుక్మిణి హరికిషన్ నాయక్, సేవాలాల్ సేన వార్డు సభ్యుడు గంగావత్ కిషన్, మాన్సింగ్, సురేష్, గంగావత్ భీక్యా, ధర్మసొత్ లక్ష్మణ్, రవి భీముడు, మేఘా బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

