నాతవరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ , జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
నర్సీపట్నం, పెన్ పవర్ :
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయిలో నేటి నుండి నాలుగు రోజులపాటు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల కేంద్రంలో తొలిరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. నాతవరం మండలం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గణేష్ దీక్షా శిబిరంలో కూర్చున్నారు. తొలి రోజు దీక్షా శిబిరానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది యువత భవిష్యత్తుతో ఆటలాడుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలలోని మోడీని ఆదర్శంగా తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం, ఈ విషయంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పేపరు లీకేజీ పై యువత చేసిన ఉద్యమానికి తలొగ్గిన బిజెపి ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించిందని, అదే తరహాలో డీఎస్సీ అక్రమాలు అరికట్టలేని చేతకాని మంత్రి లోకేష్ తోను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బాకీలను వెంటనే చెల్లించాలన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. నిరుద్యోగ యువకులను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసగించిందన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల హామీలలో చెప్పి నేటికీ రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. నాలుగు రోజులపాటు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు పూర్తిచేసి, పదవ తేదీన నర్సీపట్నంలో భారీ నిరసన ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాతవరం మండలం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎంపీపీ సాగిన లక్ష్మణ్ మూర్తి, జడ్పిటిసి కాపారపు అప్పలనరస, పైల సునీలు కరక రాజు తదితరులు పాల్గొన్నారు.

