సాంప్రదాయ నృత్యాలు చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన రంపచోడవరం
ఆకట్టుకుంటున్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలు
ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని గిరిజనల డిమాండ్
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, మే 26 :
పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివాసి రేలా ఉత్సవాలు రెండో రోజు సోమవారం సాయంత్రం అత్యంత

ఉత్సాహభరితంగా కొనసాగాయి. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచిన ఈ ఉత్సవాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బోజ్జిరెడ్డి, జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్, ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, డీఎఫ్ఓ శివకుమార్ గంగుల్, డీఎస్పీ అష్రఫ్ అలీతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ,ఎంపీపీలు, జడ్పీటీసీలు, గిరిజన పెద్దలు పాల్గొన్నారు.రేలా ఉత్సవాల్లో భాగంగా వీఆర్ పురం మండలం అడవి వెంకన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు ఆదివాసీ గ్రామాల్లో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. పెళ్లి తంతు, సంప్రదాయ ఆచారాలు, వేషధారణలు, గిరిజన సంగీతం, వాయిద్యాలతో కూడిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.అదేవిధంగా ఆదివాసీ ఘనాలు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కళారూపాలను కళాకారులు ప్రదర్శించి గిరిజన సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు. ముఖ్యంగా గిరిజన సంప్రదాయ నృత్యాలైన కొమ్ముడోలు, దింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా గిరిజనులతో కలిసి ఈ నృత్యాలలో పాల్గొనడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఈ ఆదివాసి రేలా ఉత్సవాలకు జిల్లాలోని పలు మండలాల నుంచి గిరిజన యువత, ఉద్యోగులు, మహిళలు, పెద్దలు భారీ సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు. గిరిజన సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

