ఖమ్మం పెన్ పవర్ సెప్టెంబర్ 19:
భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అన్నదానం చేయడం అభినందనీయమని మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. తొలుత కమిటీ సభ్యుడు యాస లక్ష్మారెడ్డి కమిషనర్, ఏసీపీ, సీఐలకు వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు జరిపించి శాలువాలతో సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండటం అలవర్చుకోవాలన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమష్టిగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 9 నవరాత్రులు ఎంత భక్తి శ్రద్ధతో జరుపుకుంటారో, అదేవిధంగా నిమజ్జనాన్ని కూడా అంతే భక్తిశ్రద్ధలతో జరపాలని సూచించారు. అంతేకాకుండా నిమజ్జన ఏర్పాట్లలో అధికారుల నిబంధనలను పాటించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలా నిర్వాహకులు, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదానానికి భక్తులు స్థానిక వాసులు పెద్ద ఎత్తున హాజరై స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు ముస్కరాజు, తిరుపతిరెడ్డి, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

