రక్తదానం చెయ్యండి నిండు ప్రాణాన్ని కాపాడండి
-స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడిన రక్త నిల్వల కొరతను అధిగమించేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కేవలం 20 బ్లడ్ ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, బుధవారం ఆర్డీవో కార్యాలయంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మే, జూన్ నెలల్లో తక్షణమే 200 నుంచి 250 బ్యాగుల రక్తాన్ని సేకరించాలని స్పీకర్ లక్ష్యంగా నిర్దేశించారు. నియోజకవర్గంలోని 101 పంచాయతీల నుంచి గ్రామానికి కనీసం ఒక్కరి చొప్పున, అలాగే వాకర్స్ క్లబ్, సిటీ క్లబ్ సభ్యులు, ఉద్యోగ సంఘాలు, పట్టణ ప్రజల భాగస్వామ్యంతో రక్తాన్ని సేకరిస్తామని వెల్లడించారు.

జూలైలో కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాక మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి మరో 500 నుంచి 600 బ్యాగుల రక్తాన్ని సేకరించి నిల్వలను పెంచేలా ఆయన కార్యాచరణ సిద్ధం చేశారు. రక్తాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేయలేమని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఆపదలో ఉన్న ప్రాణాలను నిలబెట్టగలమని స్పీకర్ ఉద్ఘాటించారు. ఈ సున్నితమైన అంశంపై ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహకరించాలని కోరారు. ప్రాణదానం కంటే గొప్ప దానం మరొకటి లేదని, వైద్య సేవలకు సంబంధించిన ఈ సమస్యను ఎవరూ రాజకీయం చేయవద్దని స్పష్టం చేశారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి పౌరుడితో పాటు, పత్రికా ప్రతినిధులు సైతం ముందుకొచ్చి రక్తదానం చేయాలని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, ఎంపీడీవో, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు, టిడిపి పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్, ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వాకర్స్ క్లబ్, సిటీ క్లబ్, ఎన్జీవోఎస్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

