ఎన్నో అవమానాలు తట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్
మంత్రి నాదెండ్ల మనోహర్
జగ్గంపేట, పెన్ పవర్, మార్చి 8: ఎన్నో అవమానాలు తట్టుకుని, ఆయనకున్న సినిమా అవకాశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు పరిణయ ఫంక్షన్ హాల్ లో శనివారం రాత్రి జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కౌడా చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 11 సంవత్సరాలు పార్టీని తన భుజాన మోసారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే ఈ ఆవిర్భావ సభను ప్రతీ ఒక కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున సభకు హాజరై గర్వపడేలా సభ నిర్వహిద్దామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భారీగా హాజరయ్యారు.