ఇరిగేషన్ ఎన్‌వోసి లేకుండానే..! హెచ్ఎండిఏ "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్"..!
నాలా కబ్జాకేసు తేలనే లేదు..! హైడ్రా విచారణ పూర్తికానే లేదు..!
ప్రైమార్క్ పలుకుబడితో..నాలాను దారిమళ్ళించే ప్రక్రియ షురూ..
బాధితుల విల్లాల మీదుగానే నాలాను ఏర్పాటు చేసేయత్నం..
నాలపై ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లు రక్షించే దిశగా..!పావులు కదుపుతున్న యంత్రాంగం.
2025 మార్చి 13న ప్రైమార్క్‌ను సందర్శించిన హైడ్రా కమిషనర్..
2025 మార్చి 19న హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ జారీ దేనికి సంకేతం..?
విచారణ పూర్తి కాకముందే హెచ్ఎండిఏ "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" జారీ సాధ్యమేనా..?
హైకోర్టు ఆర్డర్‌లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్రస్తావన లేదనే సాకుతో అత్యుత్సాహం..
చెరువు నాలా పునరుద్ధరించడం వదిలేసి.. ప్రైమార్క్‌ను కాపాడేందుకు యత్నం..
*పలుకుబడి ఉన్న నిర్మాణ సంస్థలకు..! ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ "జీ హుజూర్" అంటూ చేతులు కట్టుకుని ఉంటారని నిరూపించారు..! బహుదూర్‌పల్లి బాబాఖాన్ లేక్ఐడి నెంబర్ 2856 చెరువు నాలా కబ్జాదారులు "ప్రైమార్క్ హైరైజ్ టవర్‌ల" నిర్మాణ సంస్థ విషయంలో తేటతెల్లం అయింది.. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, చట్టాలు సామాన్యులకు మాత్రమే పరిమితమని..! బడా నిర్మాణ సంస్థలకి వర్తించదని "హెచ్ఎండిఏ" అధికారులు మరోసారి రుజువు చేశారు.. ప్రభుత్వ పెద్దల సిఫార్సుల ఒత్తిడి ఉందని, సాకుగా చూపించి, "హైకోర్టు ఉత్తర్వులతో "హైడ్రా" విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. చెరువు నాలా కబ్జాదారునికి బరితెగించి "హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" జారీచేయడం విశేషం.. అలాంటప్పుడు ఈ న్యాయస్థానాలు ఎందుకు..? హైడ్రా వ్యవస్థ ఎందుకు..? అధికారులే రాజ్యాధికారాన్ని చేపట్టవచ్చుకదా..! ఇదేనా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే..? ఒక పొరపాటు పది తప్పులు చేయిస్తుంది అంటే ఇదేనేమో..!దుండిగల్ రెవెన్యూ సర్వేయర్ అమ్ముడుపోయి.. విలేజ్ మ్యాప్‌లో ఉన్న చెరువు నాలాను చూపించకుండా జారీచేసిన తప్పుడు స్కెచ్ మ్యాప్‌తో..!బహుదూర్‌పల్లి ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లకి హెచ్ఎండిఏ అనుమతులు లభించాయి.. బహుదూర్‌పల్లి శ్రీరామ అయోధ్య విల్లాలు ముంపుకు గురైన తర్వాత అయినా..! కనీసం చర్యలు తీసుకోవాలనే ఆలోచన అధికారులుకు లేకపోగా..! 2023 సర్వేలో నాలాపై ఎ-బ్లాక్ గుర్తించిన అధికారులు, చర్యలు లేకుండా ముడుపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. చివరికి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన బాధితులకే వేటు వేస్తున్న అధికార యంత్రాంగంపై "పెన్ పవర్" ప్రత్యేక కథనం..*
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 23:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం బహుదూర్‌పల్లి గ్రామంలోని బాబాఖాన్ చెరువు లేక్ఐడి నెంబర్ 2856 చెరువు నాలాపై రెవెన్యూ ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండిఏ శాఖల పొరపాటు.. విల్లావాసులపై ముంపు ప్రభావం చూపుతోంది.. చెరువు నాలా ఆక్రమించారని హైకోర్టుకు వెళ్ళిన బాధితులకే శిక్ష అన్నట్టు వ్యవహరిస్తూ..!నాలా కబ్జాకు సహకరించిన అధికారులకే, పరిష్కారం పెత్తనం అప్పగించడంపై ప్రైమార్క్ ఆక్రమణలపై చర్యలు లేనట్టేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.. బాధితులకు న్యాయం చేయడం అంటే అర్ధం ఇదేనా..? కబ్జాకు గురైన నాలాను అక్రమార్కులకు వదిలేసి..! నాలాను మరోవైపు నుండి దారి మళ్ళించడమే న్యాయం చేయడమా..? కాపాడమని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే..! బాధితులకే వేటుగా మారిన రెవెన్యూ, ఇరిగేషన్ చర్యలు..! ముల్లును ముల్లుతోనే తీయాలనే నానుడికి అద్దంపడుతున్నారా..? ప్రైమార్క్ కబ్జాలను కూల్చి వేయకుండా..! ఫిర్యాదు చేసిన విల్లావాసుల నివాసాల మీదుగానే నాలాను దారి మళ్ళించడంలో ఆంతర్యం ఏంటి..? సమస్య పరిష్కారానికి మార్గం నాలా రూటు మారడమేనా..? తప్పు చేసిన అధికార యంత్రాంగంపై ఏం చర్యలు తీసుకున్నారు..? కబ్జాచేసిన ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లపై చర్యలేవి..? అధికారం ఉంది కదాని, అధికారులు వ్యవహారిస్తున్న తీరు సరైనదేనా..? 2019లో దుండిగల్ సర్వేయర్ చేసిన తప్పులకు..! బహుదూర్‌పల్లి శ్రీరామ అయోధ్య విల్లావాసులని శిక్షిస్తారా..? హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణ ప్రైమార్క్ కబ్జాలను తొలగిస్తుందా..? నాలాను దారి మళ్ళించి సహకరించే ధోరణితో వ్యవహరిస్తుందా..? ప్రైమార్క్ ఏ-బ్లాకు టవర్‌లో 88 ఫ్లాట్లు నాలాపై ఉన్నాయని నివేదికలో పేర్కొన్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు.. చర్యలు తీసుకోక పోవడానికి కారణం..? ముడుపులు భారీగా సమర్పించుకునే, బడా నిర్మాణ సంస్థ అయినందునే,నాలా దారిమళ్ళింపు ప్రక్రియను అమలు చేస్తున్నారా..? ఇరిగేషన్ "నాలా డైవర్షన్" ప్రక్రియ ఎవరి లాభాపేక్ష కోసం..? నాలా కబ్జాదారులకు పనిష్‌మెంట్ ఏంటి..? అధికారుల చర్యలు కబ్జాదారులను శిక్షిస్తున్నట్టు లేదు..! ప్రోత్సహిస్తున్నట్టు ఉంది..!
రెవెన్యూ సర్వేయర్.. ఇరిగేషన్ అధికారులే కీలకం..
బహుదూర్‌పల్లి బాబాఖాన్ లేక్ఐడి నెంబర్ 2856 చెరువు నాలాపై, నీటిపారుదల శాఖ అధికారుల చేతివాటమే కనిపిస్తుంది.. చెరువులు, నాలాలు పరిరక్షణకు ప్రత్యేకంగా నియమించబడిన ఇరిగేషన్ విభాగం 2019 నుండి బాధ్యతా రహితంగానే వ్యవహరిస్తుంది.. ఆరంభంలో విలేజ్ మ్యాప్ పరిగణలోకి తీసుకోకుండానే, దుండిగల్ రెవెన్యూ సర్వేయర్ ఇచ్చిన తప్పుడు స్కెచ్ మ్యాప్‌ను పసిగట్టి ఉంటే..! హెచ్ఎండిఏ అనుమతులు లభించేవి కాదు..! ఆతర్వాత అయినా ఇరిగేషన్ అధికారులు,అప్రమత్తమై పనులు నిలిపివేసినా పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు..! కానీ రెవెన్యూ, ఇరిగేషన్ రెండు శాఖలు కూడా ప్రైమార్క్ నిర్మాణ సంస్థకు సరెండర్ అయినట్లు స్పష్టమవుతుంది.. అందుకే వీలైనంత వరకు నాలా కబ్జాదారునికి సహకరించే ధోరణితోనే, అనుకూలంగా వ్యవహరిస్తూ..! శ్రీరామ అయోధ్య విల్లాల వాసులని బలిచేసే మహత్తరమైన ప్రక్రియ అమలుకు శ్రీకారం చుట్టారు.. అదే నాలా దారి మళ్ళింపు.. మరో సంచలనాత్మక నిర్ణయం ఏమిటంటే..! 2019 నుండి నేటి వరకు ఇరిగేషన్ ఎన్‌వోసి ఇవ్వకపోయినా హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చింది..
"ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" జారీచేసిన హెచ్ఎండిఏ..
బహుదూర్‌పల్లి బాబాఖాన్ చెరువు లేక్ఐడి నెం.2856 చెరువు నాలా కబ్జా కేసు, సుమారు రెండేళ్ళుగా, హైకోర్టులో కొనసాగుతుంది.. బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 188, 189, 191, 210 మీదుగా నాలా ఉన్నట్టు 2001 రిజిస్ట్రేషన్ పత్రాలలో స్పష్టంగా ఉంది.. 17 గుంటలు కబ్జా చేసినట్లు, సంబంధిత నాలా స్థలంపై "ఏ-బ్లాక్"లో 88 ఫ్లాట్లు ఉన్నట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు.. ఈ వ్యవహారం మొత్తం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండిఏ విభాగాలకు తెలిసిందే..! శ్రీరామ అయోధ్య విల్లాల బాధితులు, పలుమార్లు "హెచ్ఎండిఏ" అధికారులకు ఫిర్యాదు చేసారు.. అయినప్పటికీ ప్రైమార్క్ హైరైజ్ నిర్మాణాలకు "2025 మార్చి 19న(గతనెల) " ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ " జారీ చేశారు.. ఇప్పటికీ ఇరిగేషన్ ఎన్‌వోసి కూడా లేని ప్రైమార్క్ మొదటి వెంచర్‌కి.. హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడంలో భారీగా ముడుపులు ముట్టి ఉంటాయని, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..
About The Author

మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.