రైతు విశిష్ట సంఖ్య నమోదు తప్పనిసరి:తహసీల్దార్ టి.రామకృష్ణ
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్3:ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ లో నమోదు చేయించుకోవాలని తహశీల్దార్ టి.రామకృష్ణ తెలిపారు.రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు పదకొండు అంకెల గుర్తింపు సంఖ్య వస్తుందని దానికి అనుగుణంగానే వ్యవసాయ అనుబంధ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.గురువారం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు,వ్యవసాయ సహాయకులు, గ్రామ సర్వేయర్లతో,ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ లో నమోదు చేసేందుకు వీఆర్వోలు,వ్యవసాయ సహాయకులు విధిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన ఆహారవంతమైన ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు ద్వారా ఆహార పదార్థాలు పండించాలని సూచించారు.రీ సర్వే జరిగే గ్రామాలలో రైతులు విధిగా పాల్గొని సిబ్బందికి సహకరించాలని కోరారు. రైతులు మ్యుటేషన్ చేయించుకుంటే అన్నదాత సుఖీభవ వంటి ఇన్పుట్ సబ్సిడీ పథకాలు పొందేందుకు అవకాశం ఉందని అన్నారు. దుకాణాల్లోనూ సంతల్లోనూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉపయోగించకుండా నిషేధానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మధుసూదన్,ఆర్ ఐ మహదేవ్, మండల సర్వేయర్ శ్రీను,విఆర్వోలు,వ్యవసాయ సహాయకులు గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.