గుమ్మిలేరులో నిత్య చలివేంద్రం.
ఆలమూరు
సాధారణంగా ఉగాది వచ్చిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో చలివేంద్రాల హడావిడి మొదలవుతుంది.మండే ఎండల్లో బాటసారుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మన సాంప్రదాయం. అయితే ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో మాత్రం దాతల సహకారంతో సర్పంచ్ గుణ్ణం రాంబాబు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వారు నిత్య చలివేంద్రం నిర్వహిస్తున్నారు. బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన ఈ కూలింగ్ వాటర్ సిస్టం 365 రోజులు బాటసారుల దాహార్తిని తీరుస్తుంది. రోజుకు సుమారు 500 లీటర్ల శుద్ధ జలాన్ని ఈ చలివేంద్రం ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. జొన్నాడ కాకినాడ ప్రధాన రహదారిపై ఉన్న గుమ్మిలేరు వచ్చేసరికి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరికైనా బాటసారులకు మంచినీళ్లు కావాలంటే పది రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో ఇటువంటి నిత్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సర్పంచ్ రాంబాబు అభిప్రాయపడ్డారు