రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
తాడేపల్లిగూడెం
కార్మిక నేతల పిలుపు
బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలని , రాజ్యాంగాన్ని మార్చేందుకు మతోన్మాద శక్తులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్మికనేతలు పిలుపు ఇచ్చారు. మునిసిపల్ వర్కర్స్ కాలనీ కార్మికుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తాలూకా ఆఫీస్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన గొప్ప ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగాన్ని మార్చడానికి మతతత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో రాజరికాన్ని కొనసాగించి , మనుస్మృతిని అమలు చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయని , వాటిని జాతీయోద్యమకాలం నుండి అంబేద్కర్ ఎదుర్కొన్నారని తెలిపారు. కుల వివక్ష, అసమానతలు, అంతరాలు లేని నాగరిక ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించడానికి అంబేద్కర్ స్ఫూర్తితో యువతరం పోరాడాలన్నారు.
చింతకాయల బాబూరావు మాట్లాడుతూ బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అందించిన మహత్తర రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశంలో పెచ్చుమీరుతున్న మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు.
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ మనుస్మృతి ఆధారంగా నడిచే ఫ్యూడల్ కులవ్యవస్థను తిరిగి తెచ్చేందుకు మనువాదులు చేస్తున్న కుటిల యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సి.ఐ.టి.యు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనాల వెంకట్రావు, ఎ.ఐ.టి.యు.సి. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, అనుబంధం మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాడిమి అచ్చిబాబు, హోమియో వైద్యులు ధనాల సాయిరామ్ తదితరులు మాట్లాడారు.