తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లలో ఈడీ సోదాలు
ED searches at houses of film celebrities in Tamil Nadu
కొన్ని వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ రాకెట్ తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు లోని సినీ నిర్మాత జాఫర్ సాదిక్ , సినీ దర్శకుడు అమీర్ మరికొందరి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దాడులు ప్రారంభించింది.
చెన్నై: కొన్ని వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ రాకెట్ తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు లోని సినీ నిర్మాత జాఫర్ సాదిక్ , సినీ దర్శకుడు అమీర్ మరికొందరి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దాడులు ప్రారంభించింది. రాష్ట్ర రాజధాని చెన్నై, మదురై, తిరుచిరాపల్లి, తదితర ప్రాంతాల్లో మొత్తం 25 చోట్ల కేంద్ర పారామిలిటరీ దళాల రక్షణతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
కొన్నిడాక్యుమెంట్లు, ఎలెక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 2000 కోట్ల విలువైన 3500 కిలోల సుడోఎఫిడ్రిన్ అనే మాదకద్రవ్య స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణతో గత నెల సాదిక్ (36)ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ( ఎన్‌సిబి) బృందం అరెస్ట్ చేసింది. ఎన్‌సిబి చేపట్టిన ఈ కేసుపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సాదిక్, మరికొంతమందిపై దాడులు చేపట్టింది. తమిళ, హిందీ ఫిలిం అత్యున్న త స్థాయి ప్రముఖులతో సాదిక్‌కు సంబంధాలు ఉన్నాయని, రాజకీయ పార్టీలకు కూడా ఆయన నిధులు అందించారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్టు ఎన్‌సిబి దాడుల్లో బయటపడడంతో అధికార డిఎంకె తమ పార్టీ నుంచి సాదిక్‌ను గత ఫిబ్రవరిలో బహిష్కరించింది.
అదే సమయంలో తమిళనాడు న్యాయశాఖ మంత్రి , డిఎంకె నేత ఎస్, రేగుపతి తమ పార్టీతో సాదిక్‌కు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా దేశాలకు భారత్ నుంచి సుడోఎఫిడ్రిన్ స్మగ్లింగ్ చేయడంలో పెద్ద రాకెట్ నడుస్తోంది. దీనికి సూత్రధారి సాదిక్‌గా ఎన్‌సిబి ఆరోపిస్తోంది. గత ఫిబ్రవరి 15న ఢిల్లీ లోని ఒక గొడౌన్ పై ఎన్‌సిబి ఢిల్లీ పోలీస్‌లతో కలిసి దాడి చేసి 50 కిలోల సూడోఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ స్మగ్లింగ్ రాకెట్ గుట్టు బయటపడింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో సుడోఎఫిడ్రిన్ స్మగ్లింగ్ అవుతోందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అధికారులు 2023లో క్లూ అందించడంతో ఎన్‌సిబి నిఘా పెట్టింది. కొబ్బరి పౌడర్‌తో ఈ సుడోఎఫిడ్రిన్‌ను కలిసి స్మగ్లింగ్ చేస్తుంటారు. సాదిక్‌తో అరెస్ట్ అయిన ముగ్గురు ఈ స్మగ్లింగ్ రాకెట్ ను బయటపెట్టారు.
గత మూడేళ్లలో సుడో ఎఫిడ్రిన్ కన్‌సైన్‌మెంట్స్ దాదాపు 45 అంటే రూ. 2000 కోట్ల విలువైన 3500 కిలోల వరకు అంతర్జాతీయ మార్కెట్‌కు పంపామని వారు ఒప్పుకున్నారు. ఈ విధంగా వచ్చిన డబ్బును సాదిక్ సినిమాల నిర్మాణం లోను, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లోను పెట్టుబడిగా పెట్టేవాడని తేలింది. ఈ స్మగ్లింగ్‌లో కిలోకు రూ. లక్ష కమిషన్‌గా సాదిక్‌కు దక్కేదని తెలిసింది. సాదిక్ అరెస్ట్ అయిన తరువాత దీంతో సంబంధం ఉన్న మరికొంతమందిని యాంటీ నార్కొటిక్ ఏజెన్సీ ప్రశ్నించింది. మెథాంఫిటమైన్ తయారీకి ఈ సుడోఎఫిడ్రిన్‌ను వినియోగిస్తారు. మరోపక్క ఐటీ దాడులు కూడా కొనసాగుతున్నాయి.