బీసీలపై స్పెషల్‌ ఫోకస్‌

బీసీలపై స్పెషల్‌ ఫోకస్‌

ఏపీలో కూటమి ప్రభుత్వం బీసీలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు కులాలవారీగా కార్పొరేషన్లు పెట్టి ఆకట్టుకుంది. ఆ కార్పొరేషన్ల వల్ల అట్టడుగు వర్గాలకు లాభం జరిగిందా, కేవలం చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మెంబర్లు లబ్ధిపొందారా అనే విషయం పక్కనపెడితే తాజాగా కూటమి ప్రభుత్వం బీసీలకు నిజమైన ప్రోత్సాహం అందిస్తామంటూ ముందుకొస్తోంది.


స్టాఫ్‌ రిపోర్టర్‌ పెన్‌పవర్‌  విజయవాడ, సెప్టెంబర్‌ 19:


చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే దిశగా మరో అడుగు ముందుకేస్తామంటోంది. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామంటోంది ప్రభుత్వం. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సంబంధించిన ఫైల్‌ పై ఈరోజు మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయడానికి ఇది సన్నాహక కార్యక్రమంగా తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో అమలైన ఎన్టీఆర్‌ విదేశీవిద్య, విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించాలని కూడా సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లబ్ధిదారులుగా ఉన్న పథకాల నిబంధనల్లో మార్పులు చేయాలని, ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా నిబంధనలు సవరించాలని ఆయన చెప్పారు. 26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌ నిర్మాణాలు చేపట్టాలని, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం సూచించారు. ఇక బీసీ స్టడీసర్కిళ్లు నిధులు లేక కార్యకలాపాలు స్తంభించాయని, వాటికోసం వెంటనే రూ.10 కోట్లు విడుదల చేయాలని చెప్పారు. సచివాలయంలో బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమశాఖల సమావేశంలో అధికారులతో సవిూక్ష నిర్వహించారు చంద్రబాబు. బీసీ రిజర్వేషన్‌ ఫైల్‌ సహా ఇతర కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఏపీలో 139  బీసీ ఉపకులాల వారికి లబ్ధి చేకూర్చేలా కార్పొరేషన్లను పునర్‌ వ్యవస్థీకరించడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 56 బీసీ కార్పొరేషన్లను పునర్‌ వ్యవస్థీకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కులాలు, ఉప కులాల వారీకా కార్పొరేషన్ల పునర్‌ వ్యవస్థీకరణ ఉండాలన్నారు. బీసీల అభ్యున్నతికి కేంద్రం కూడా పలు పథకాలు అమలు చేస్తోంది. ప్రతి ఏడాదీ రూ.100కోట్ల మేర రాయితీ రుణాలు అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రబుత్వం రూ.38 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌ గా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ నిధుల్ని తక్షణం విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇక గత ప్రభుత్వం వదిలి పెట్టిన బకాయిల విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గురుకుల విద్యార్థులకు రూ.110 కోట్ల మేర డైట్‌ ఛార్జీలు, రూ.20.52 కోట్ల మేర కాస్మొటిక్‌ ఛార్జీలను గత ప్రభుత్వం బకాయి పెట్టిందని, వాటిని తమ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు చంద్రబాబు. ఇక బీసీ హాస్టల్స్‌ మరమ్మతులు, విద్యాసామగ్రి ఖర్చులు, స్కాలర్‌ షిప్‌ లకు సంబంధించి రాష్ట్ర వాటాను కూడా వెంటనే విడుదల చేస్తామన్నారు. బీసీ భవన్‌, బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు గతంలో తాము ప్రారంభించామని, ఆగిపోయిన చోట్ల తిరిగి నిర్మాణాలు ప్రారంభించాలని, వాటికి అవసరమయ్యే నిధుల్ని వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇక బీసీలకు సంబంధించి బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
2

About The Author