కలెక్టర్ చొరవతో ఆరుగురు విద్యార్ధులు కార్పోరేట్ ఆసుపత్రులకు తరలింపు
స్టాప్ రిపోర్టార్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 20: కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన పలువురు విద్యార్ధులు వేరువేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విషయం విదితమే.సోమవారం సాయంత్రం పాడేరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది విద్యార్ధులను ఆసుపత్రి సందర్శించి పరామర్శించిన కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఆవేదన చెందారు.అప్పటికే నర్సీపట్నంలో చికిత్స తీసుకుంటున్న 15 మంది విద్యార్ధుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కెజిహెచ్ కు తరలించిన విషయం తెలుసుకున్న కలెక్టర్ మరింత ఆవేదనకు గురై రాత్రి 11.00 గంటలకు హుటాహుటిన నేరుగా కెజిహెచ్ కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్ధులు వారి తల్లిదండ్రులను పరామర్శించారు.తెల్లవారు ఝాము మూడు గంటల వరకు అక్కడే ఉండి డాక్టర్లతో చర్చించిన తరువాత అందులో ఆరుగురు పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుసుకున్న కలెక్టర్ చొరవ తీసుకుని విశాఖ నగరంలో ప్రముఖ కార్పోరేట్ ఆసుపత్రులైన మెడికవర్ కు ముగ్గురుని, కిమ్స్ కు ఇద్దరినీ, రెయిన్ బో కు ఒకరిని తరలించి మెరుగైన అత్యవసర చికిత్సలు అందించాలని ఆదేశించారు.అంతటితో ఆగకుండా మంగళవారం ఉదయమే బయలుదేరి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరినీ పరామర్శించారు.వివరాలలోకి వెళ్తే ఈ నెల 17వ తేదీన అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఒక చర్చ్ ఫాథర్ ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీట్ లో తీసుకున్న ఆహారం విషహారంగా మారి 93 మంది విద్యార్ధులు అనారోగ్యం పాలైన విషయం విదితమే. అందులో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందగా మరో 59 మంది విద్యార్ధులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15మందిలో 14 మందిని కెజిహెచ్ కు తరలించారు.అదేవిధంగా ఆశ్రమంలో ఉన్న ముగ్గురు విదార్ధులు మృతి చెందడం దురదృష్టమని మిగిలిన 93 మంది విద్యార్ధులను వివిధ మార్గాల ద్వారా గుర్తించి వారందరి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, అవసరం మేరకు దగ్గరలోని ఆసుపత్రులకు పంపించి చికిత్స అందించడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని విదార్దుల తల్లిదండ్రులు, సంరక్షకులు కలెక్టర్ ను అభినందించారు.ఈ అంశంలో ఎప్పటికప్పుడు వివరాలు అప్ డేట్ చేస్తూ వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేసిన జేసి డా.అభిషేక్,పిఒ వి.అభిషేక్, డిఎంహెచ్ఓ డా.జమాల్ బాషా,ఆసుపత్రుల డాక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది అందరికీ కలెక్టర్ అభినందించారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.