జీకే వీధిలోని కృపా కమల్ నేతన్య వసతి గృహాన్ని సీజ్ చేసిన అధికారులు :విద్యార్థులకు గవర్నమెంట్ హాస్టళ్లకు తరలింపు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఉన్న కృపా కమల్ నేతన్య వసతి గృహాన్ని శుక్రవారం అధికారులు పరిశీలించి సీజ్ చేయటం జరిగింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తాహసిల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్,ఏటిడబ్ల్యూ జయ నాగలక్ష్మి,డిప్యూటీ తాహసిల్దార్ కుమారస్వామి వసతి గృహాన్ని పరిశీలించి అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. నేతన్య గిరిజన సంఘం అని రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ,వసతి గృహం నిర్వహణకు సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడంతో, అధికారులు వసతి గృహాన్ని సీజ్ చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వసతి గృహ నిర్వాహణకు సంబంధించి సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు లేవని,అందు నిమిత్తం వసతి గృహాన్ని సీజ్ చేయటం జరుగుతుందని తెలిపారు. వసతి గృహంలో ఉంటున్న 30 మంది పిల్లలను గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లలను గూడెం కొత్త వీధిలోని బాలికల ఆశ్రమ పాఠశాలకు,మగ పిల్లలను కొత్తూరు లోని బాలురు పాఠశాలకు తరలించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయంలోని ఆర్ఐ మహాదేవ్,సీనియర్ అసిస్టెంట్ పి. చిన్నారావు, వీఆర్వో వసుపరి లింగాలు, ఏఎస్ఐ ఎస్ సంతోష్ కుమార్,
మహిళా పోలీసు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.