మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలో చర్యలు
Kavali
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కావలి పట్టణంలో మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడుతున్నట్లు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. ఆదివారం కావలిలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి చెందిన సబ్ సెంటరును శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తో కలిసి సందర్శించారు. ముందుగా ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసిన చైర్మన్ ను స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సత్కరించారు. మినీ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికలను శాప్ ఛైర్మన్ కు ఎమ్మెల్యే వివరించారు. స్టేడియంను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కావలి క్రీడాప్రాంగణం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో త్వరలో మల్టీపర్పస్, మినీ స్టేడియం నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా నిధులు సమకూరుస్తామని, త్వరలోనే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో క్రీడా సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలోనూ క్రీడావికాస కేంద్రాలు, స్టేడియంల నిర్మాణాలకు భూమిపూజలు, శంకుస్థాపనలు చేపడుతున్నామని అన్నారు. 40శాతం నుంచి 90 శాతం వరకూ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 2019లో వైసీపీ హయాంలో క్రీడారంగానికి గ్రహణం పట్టిందని విమర్శించారు. కేవీకే భవనాలు, స్టేడియం నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వవైభవం రానున్నదని, రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా నిలిచిపోయిన అన్ని కేవీకేలను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రా క్రీడాకారులు రాణించే దిశగా కసరత్తు చేస్తామని అన్నారు. పారిశ్రామికవేత్తలు, దాతలు ప్రోత్సహిస్తే క్రీడారంగంలో సత్ఫలితాలు లభిస్తాయని అన్నారు. క్రీడాకారుల భద్రతకు భరోసాగా యూనిఫాం ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉండేలా చేస్తామన్నారు. క్రీడా ప్రోత్సాహకాలు, క్రీడా సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2027లో ఏపీలో నేషనల్స్ గేమ్స్ నిర్వహించేలా సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిపారు. క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా శాప్ పనిచేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. దానిలో భాగంగా శాప్ ఛైర్మన్ రవినాయడు డీఎస్ఏల పర్యటన చేస్తున్నారని, క్రీడాసమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని అన్నారు. క్రీడాభివృద్ధికి శాప్ ఛైర్మన్ కృషి అభినందనీయమని అన్నారు. కావలి మినీ స్టేడియంపై శాప్ ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆ దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాప్రాంగణం, మినీ స్టేడియం నిర్మాణానికి నావంతు కృషి చేస్తానని, నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని అన్నారు. కావలి నియోజకవర్గాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం కావలి ఎమ్మెల్యే స్వీయ నిధులతో నిర్మించిన 100 అడుగుల ఎత్తులోని జాతీయ జెండా, 'ఐ లవ్ కావలి' సెల్ఫీ పాయింట్ ను శాప్ చైర్మన్ సందర్శించి, ఎమ్మెల్యే తో సెల్ఫీ ఫోటో దిగారు. మహనీయుల చిత్ర పటాల గ్యాలరీ, ఇప్పటివరకు కావలి నియోజకవర్గ శాసన సభ్యులుగా ఎన్నికైన వారి ఫోటోలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు, కండ్లగుంట మధుబాబు నాయుడు, తిరివీధి ప్రసాద్, తటవర్తి వాసు, జనసేన కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్, సిద్దు, క్రీడాకారులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.