టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత

ganjna-with-the-help-of-technology

టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత

క్రైం బ్యూరో పెన్ పవర్,  నెల్లూరు, ఫిబ్రవరి 17: 
నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్‌ పాయింట్‌గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతోపాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు నిదర్శనం. గంజాయి రవాణా స్టార్టింగ్‌ పాయింట్‌ నుంచి డెలివరీ పాయింట్‌ వరకు నేరుగా ఒకేసారి సరఫరా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నిత్యం వాటిపై నిఘా ఉండడం. విశాఖ నుంచి నేరుగా ఒక్కసారిగా తమిళనాడు లేదా కర్ణాటక లకు తరలించడం సాధ్యం కాకపోవడంతో నెల్లూరును స్టాక్‌ పాయింట్‌గా ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి అనువైన రోజున ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది గంజాయి మాఫియా.ఈ క్రమంలోనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. ఇటీవల నెల్లూరు నగరంలో గంజాయి వాడకం ఎక్కువ కావడంతో నిత్యం ఏదో ఒకచోట అల్లర్లు, ఘర్షణలు, హత్యలకు కూడా దారి తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇందులో భయానకరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో విద్యార్థులు కూడా గంజాయి బానిసలుగా మారుతున్నారు. నెల్లూరు పోలీసులు నిర్వహించిన సెర్చ్‌ ఆపరేషన్‌లో గంజాయి సేకరిస్తున్నది అధిక సంఖ్యలో విద్యార్థులుగా గుర్తించి పోలీసులే షాక్‌ అయ్యారు.నిత్యం నిఘా ఉంచిన గంజాయి విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయి. ఎక్కడినుంచి కొనుగోలు చేస్తున్నారు. గంజాయి సేవించడం అనేది ఎక్కడ జరుగుతుంది అన్న విషయంలో పోలీసులు చాలా రోజులుగా సమాచారం రాబట్ట లేకపోయారు. తాజాగా నెల్లూరు నగరంలోని మూతపడ్డ ట్రస్ట్‌ హాస్పిటల్‌ ఆవరణలో స్మైలింగ్‌ సహా గంజాయి సేవించే వారు అధికంగా వస్తూ పోతున్నట్లు గుర్తించారు. నేరుగా అక్కడకు పోలీసులు వెళ్లాలంటే దాడులకు తెగబడే అవకాశం ఉంది. అలాగని ఫార్మర్లను పంపిన కూడా ప్రమాదం. కాబట్టి అక్కడ గంజాయి జాడ నిర్ధారించుకునేందుకు నెల్లూరు పోలీసులు టెక్నాలజీని ఉపయోగించారు.డ్రోన్ల సాయంతో ఆ పరిసరాలన్నీ వీడియో రికార్డ్‌ చేసి అక్కడ అనుమానిత వ్యక్తులు వస్తూపోతుండడం అలాగే గంజాయి సేవిస్తున్న విషయాన్ని నిర్ధారించుకున్నాక పోలీసులు ఒక్కసారిగా రైడ్‌ నిర్వహించారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకడు.. సజ్జా సాయి. ఆటోడ్రైవర్‌గా ఉన్న సాయి నెల్లూరులో గంజాయి పెడలర్‌ గా వ్యవహరిస్తున్నాడు. అజీజ్‌ అనే మరో వ్యక్తి ఒరిస్సా నుంచి భారీగా గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఇక తోసిఫ్‌ అనే వ్యక్తి ఈ ఇద్దరి నుంచి తీసుకుని గంజాయి అమ్ముకుంటున్న వ్యక్తిగా గుర్తించారు.పోలీసులు జరిపిన దాడుల్లో ముగ్గురి నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు నిత్యం గంజాయి సేవిస్తున్న వారిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. వారందరికీ తల్లిదండ్రుల సమావేశంలో కౌన్సిలింగ్‌ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారిపై ఎవరెవరు అక్కడికి వచ్చి గంజాయి కొనుగోలు చేస్తున్నారో వారందరిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు నెల్లూరు పోలీసులు

About The Author