ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్ ఆఫీసర్ల పాత్ర కీలకం
బాధ్యతగా పనిచేయాలి:జిల్లా ఎన్నికల అధికారి హరి నారాయణన్.
ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్ ఆఫీసర్ల పాత్ర అత్యంత కీలకమని, పోలింగ్ ముగిసే వరకు బాధ్యతాయుతంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్
బుధవారం కావలి రెవిన్యూ డివిజన్ అధికారి సెక్టోరల్ అధికారులకు కలెక్టర్ ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు అందరూ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఎటువంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పారు. పోలింగ్ రోజు మే 13న పూర్తిస్థాయిలో ముగిసే వరకు సెక్టోరల్ అధికారులు అత్యంత అప్రమత్తంగా తమ విధులను నిర్వహించాలన్నారు. తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వివరాలు, రూట్ మ్యాప్ లను పూర్తిగా సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగేటప్పుడు, పోలింగ్ తరువాత ఈ మూడు ప్రక్రియలు చాలా ప్రధానమని, అలాగే ఈవీఎంల మేనేజ్మెంట్ పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓటర్లకు డోర్ టు డోర్ ఓటరు స్లిప్పులను బూత్ లెవల్ అధికారుల ద్వారా అందించే బాధ్యత సెక్టోరల్ ఆఫీసర్లదే అన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అప్పగించే ఈవీఎంలు, స్టేషనరీ నుంచి పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ సెంటర్ల వద్ద అందించే ప్రక్రియ వరకు సెక్టోరల్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యత అన్నారు. అన్ని రకాల సర్టిఫికెట్లను పూర్తిగా చెక్ చేసుకుని రిసెప్షన్ సెంటర్లో అందజేయాలన్నారు. సెక్టోరల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు ఏ చిన్న సమస్య ఏర్పడినా ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారులకు తెలిపి, తగిన పరిష్కారం చేయాలన్నారు. తమ పరిధిలోని సెక్టోరల్ ఆఫీసర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుగానే పూర్తి చేసుకునేలా సన్నద్ధం కావాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేలా తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో కావలి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు శీనా నాయక్, విద్యాధరి, కమిషనర్ శ్రావణ్ కుమార్, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.