ఈ 'పాప'౦ ఎవరిది..?
ఏల్చూరు దర్గా సెంటర్లో పురిటిబిడ్డ ప్రత్యక్షం
శిశువును చేరదీసిన స్థానికులు
అంగన్వాడీల సంరక్షణలో పసికందు
తల్లిదండ్రుల ఆచూకీ కోసం నిరీక్షణ
అన్ని కోణాల్లో విచారిస్తున్న అధికారులు, పోలీసులు
సంతమాగులూరు, పెన్ పవర్ ఆగస్టు 13:
బిడ్డల కోసం నవమాసాలు మోసింది ఆ మాతృమూర్తి. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇంతలోనే ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ, ఆ పురిటి బిడ్డను వదిలేసి.. పేగు బంధాన్ని తెచ్చుకుంది. ఈ అమానవీయ సంఘటన బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలం, ఏల్చూరులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ పసికందును ముతకపడిన దుస్తుల్లో చుట్టి..ముస్లింలు ఆరాధించే దర్గా పక్కనే ఉన్న వాహనం షల్టర్ లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఇంకా కళ్లు కూడా సరిగ్గా తెరవని ఆ పసిగుడ్డు చిమ్మచీకటిలో గుక్కపెట్టి ఏడవసాగింది. ఆ సమీపంలో ఆటలు ఆడుతున్న కొంతమంది చిన్నారులు పసికందు ఏడుపును పసిగట్టారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలకు విషయం తెలియజేశారు. వారంతా హుటాహుటిన దర్గా సెంటర్ వద్దకు చేరుకుని పురిటి బిడ్డను అక్కున చేర్చుకున్నారు. బిడ్డకు దుస్తులు వేసి సపర్యలు చేశారు. ఈ విషయాన్ని కొందరు యువకులు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన సంతమాగులూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో డి.సుధా..ఏల్చూరు గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలు షేక్.మస్తానమ్మ, బండారు ఇందిరా, ఆశావర్కర్ కమలాకు ఆదేశాలు ఇచ్చారు. వారు వెంటనే దర్గా సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఆ పసికందును తీసుకుని వైద్య పరీక్షలు నిమిత్తం సంతమాగులూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు శిశువుకు పరీక్షలు జరిపారు. మెరుగైన వైద్యం కోసం అద్దంకి ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. సీడీపీవో సుధా మహిళా పోలీసులు మహాలక్ష్మి, సుమన, అమీన్, అంగన్వాడీలు, ఆశాతో కలిసి పాపను 108 వాహనంలో తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా పసికందుకు అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉందన్నారు. అయితే శిశువు బరువు (2.2 కేజీలు) తక్కువగా ఉన్నందున ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని చెప్పినట్లు సీడీపీవో మీడియాకు వివరించారు. ప్రస్తుతం పసికందు తాలూకా ఎలాంటి సమాచారం తెలియరాలేదు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం:
ఏల్చూరులో సోమవారం రాత్రి ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన విషయం సంతమాగులూరు పోలీసు స్టేషన్ నుంచి సమాచారం వచ్చింది. వెంటనే స్థానికంగా ఉన్న మా అంగన్వాడీ కార్యకర్తలను అప్రమత్తం చేశాం. స్థానికుల సాయంతో పసికందుకు పాలు పట్టడం జరిగింది. శిశువు ఆరోగ్యంపై మండల ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించడం జరిగింది. వారి సూచనల మేరకు తొలుత అద్దంకి ఏరియా ఆస్పత్రికి, తదుపరి ఒంగోలు రిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేశాం. ఆడశిశువు దొరికిన విషయం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియజేశాం. వారి ఆదేశాలు మేరకు డీసీపీవో యూనిట్ వారు మాతో మాట్లాడారు. డీసీపీవో నుంచి సీడబ్ల్యూసీకి నిబంధనలు మేరకు పసికందును వారికి అప్పగించనున్నాం. అక్కడి నుంచి ఒంగోలులోని శిశు సంక్షేమ గృహానికి శిశువును తరలించడం జరుగుతుంది.
-డి.సుధా, సీడీపీవో, సంతమాగులూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు