ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..!

ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..!

20ఏళ్లుగా న్యాయస్థానాలు చేయలేని పని.. చిటికెలో పూర్తి..
కబ్జాదారులకి కాపుగాస్తున్న సార్లు.. సర్వే నెం. 227లో.. అధికారుల చిత్ర విచిత్ర విన్యాసాలు..
2022 డిసెంబర్ 20లో కలెక్టర్ ఎస్.హరీష్, తహశీల్దార్ పద్మప్రియ హయాంలో మొదలు..
2023లో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ టి.సుచరిత హయాంలో ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు..
2024లో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాయినాథ్ సొసైటీ ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు..2000 సం.లో సాయినాథ్ సొసైటీ ఎన్ఓసి కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌కి అర్జి..
227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినందున "ఎన్ఓసి" నిరాకరించిన కలెక్టర్..
వెంటనే హైకోర్టును ఆశ్రయించిన సాయినాథ్ సొసైటీ సభ్యులు..
ఆ వెంటనే బహుదూర్‌పల్లి సర్పంచ్ శివునూరి సుజాత 227 ప్రభుత్వ భూమిగా మరో పిటిషన్..
రెవెన్యూ సంబంధిత వివాదం కాబట్టి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌‌కి హైకోర్టు డైరెక్షన్..
హైకోర్టు డైరెక్షన్‌తో అప్పటి జాయింట్ కలెక్టర్ కూలంకషంగా సుదీర్ఘ విచారణ..
2009-9-9న 227 సర్కారీ జమీన్‌‌గా ప్రొసీడింగ్ జారీచేసిన నాటి "జేసి జగన్మోహన్ ఐఏఎస్"..
2010లో హైకోర్టును మళ్ళీ ఆశ్రయించిన సొసైటీ సభ్యులకు "స్టేటస్‌కో"విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు..
కేసు హైకోర్టులో ఉండగానే "2022 డిసెంబర్ 20" నుండి 2023 అక్టోబర్ వరకు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు.
2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు షురూ..
నోటీసులిచ్చిన షెడ్లకు ముడుపులు..? కంటైనర్‌ల ఏర్పాటుకు కమిట్‌మెంట్‌లు..?
బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "అధికారుల చిత్రవిచిత్రాలు"..
అక్రమ షెడ్డుకు నోటీసులిచ్చిన తహశీల్దార్ చర్యలు తీసుకోక పోవడానికి కారణం"ముడుపులేనా"..?
హైకోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జిల్లా అధికారి అండతో సీసీరోడ్డు..
కూల్చివేసిన "కమ్మ సేవాసమితి" కమాన్‌ను మళ్ళి నిర్మిస్తున్న కబ్జాదారులు..
బౌరంపేట్‌ రోడ్డులో కంటైనర్‌లతో 227 "సర్కారీ జమీన్" ఆక్రమణ..
మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలకు ఆదేశించినా..! చర్యలు శూన్యం..!!
దుండిగల్ తహశీల్దార్ ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్..

231120241
 
రూ.2 వేలకోట్లు విలువైన ప్రభుత్వ భూమి. గత 20 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలో ఉండగానే "ముగ్గురు కలెక్టర్‌లు, ముగ్గురు తహశీల్దార్‌ల హయాంలో ఆక్రమణ దారులకు అక్రమ రిజిస్ట్రేషన్‌‌లు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.. చట్టంలోని లొసుగులతో సుమారు 200 కు పైచిలుకు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లతో ధారాదత్తం చేయగా.. మరికొన్ని హైకోర్టు ఆర్డర్‌లతో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్‌లు రిజిస్ట్రేషన్‌‌లు సాఫీగా కొనసాగించారు..సర్కారు భూములు పరిరక్షంచాల్సిన అధికార యంత్రాంగం కబ్జాదారులకు కాపుగాస్తున్నారు.. ఇరవై ఏళ్ళుగా హైకోర్టు కేసులో పెండింగ్‌ ఉన్న 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు, 20 ఏళ్ళుగా న్యాయస్థానాలు చేయలేని పని "ముగ్గురు కలెక్టర్‌లు- ముగ్గురు తహశీల్దార్‌లు" కబ్జాదారులకు పట్టం కట్టారు.. నిషేధిత జాబితాలో ఉన్న వేలకోట్లు విలువైన భూములను సులభంగా రిజిస్ట్రేషన్‌‌లు చేయడంపై తీవ్ర సంచలనం రేపుతోంది..
ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్లకు నోటీసులు జారీ చేసిన తహశీల్దార్, నేటికీ చర్యలు తీసుకోక పోవడానికి కారణం ముడుపులేనని ఆరోపణలు వస్తున్నాయి.. నోటీసులు ఇచ్చిన అక్రమ షెడ్డు, కమిట్‌మెంట్‌లతో ఏర్పాటు చేసిన కంటైనర్‌లపై చర్యలకు చేతగాక వార్తలు రాస్తున్న విలేఖరులపై  బెదిరింపులకు అక్రమార్కులను ఉసిగొలుపుతున్నారు.. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న సామెతకు అద్దం పడుతూ..! స్థానిక రెవెన్యూ అధికారులు మొదలుకొని జిల్లా రెవెన్యూ అధికారుల వరకు ప్రభుత్వ భూములు కబ్హాదారులకు కట్టబెట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.. అందుకు ఉదాహరణ బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు..
 
మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, నవంబర్ 21:
 
మేడ్చల్ జిల్లా దుండిగల్‌ గండిమైసమ్మ మండలం బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు.. ఓవైపు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ.. 2022 నుండి ఇప్పటి వరకు ముగ్గురు కలెక్టర్‌లు, ముగ్గురు తహశీల్దార్‌లు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు, సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌‌లు చేయడం విశేషం.. ఓవైపు ఇరవై ఏళ్ళుగా ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు నడుమ హైకోర్టు పరిధిలోనే కొనసాగుతుంది.. అయినప్పటికీ చట్టంలోని లొసుగులతో, హైకోర్టును ధిక్కరించి రెవెన్యూ అధికారులు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు, చేపట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.. ఇదంతా ముగ్గురు కలెక్టర్‌ల హయాంలో రిజిస్ట్రేషన్‌‌ల ప్రక్రియ కొనసాగటం..! సీసీఎల్ఏ కమిషనర్‌కి తెలియకుండా సాధ్యామేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ప్రభుత్వ భూముల్లో పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే అధికారులు.. వేలకోట్లు విలువైన 353.35 ఎకరాలపై ఇంత నిర్లక్ష్యంగా  రిజిస్ట్రేషన్‌‌లు ఎలా చేశారు..? భూ పరిరక్షణ అంటే ఇదేనా..? ధరణీలో లొసుగులు హైకోర్టును ధిక్కరించమని ఉందా..? ఇరవై ఏళ్ళుగా హైకోర్టు పెండింగ్‌లో ఉన్న స్థలాన్ని న్యాయస్థానం తీర్పు వెలువడక ముందే రిజిస్ట్రేషన్‌‌లు చేసేటట్లు అయితే కోర్టులు ఎందుకు..? జిల్లా మేజిస్ట్రేట్‌గా కలెక్టర్, మండల మేజిస్ట్రేట్‌గా తహశీల్దార్‌లే తీర్పు ఇవ్వొచ్చుకదా..! అంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు.. అసలు నిషేధిత జాబితాలో పెట్టిన ప్రభుత్వం.. ఆ విషయాన్ని మరిచిపోయి వ్యవహరించారా..? 
 
సర్వే నెం.227లో గతంలో ఏం జరిగింది..
 
2000 సంవత్సరంలో 227 ప్రభుత్వ భూమి కొనుగోలు దారులు "ఎన్ఓసి"కి వెళ్ళగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నిరాకరించారు.. 1938 (నిజాం కాలంనాటి కలెక్టర్ ఉన్నీసాబేగం హయాం) నుండి బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 పోరంబోకు భూమిగా 353.35 ఎకరాలు ఉన్నట్లు పేర్కొంటూ రిజెక్ట్ చేసినట్లు సమాచారం.. అందుకే ప్రస్తుత తహశీల్దార్ కూడా సురేందర్ రెడ్డి 400 గజాల అక్రమ షెడ్డుకు ఇచ్చిన నోటీసులోనూ 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా పేర్కొన్నారు.. ఇప్పటికీ షెడ్డుపై చర్యల్లేవు.. సంబంధిత షెడ్డుకు భారీ మొత్తంలో తీసుకున్నారని, అందుకే చర్యలు లేవని ఆరోపణలు వస్తున్నాయి.. ఇదిలా ఉండగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ఓసి నిరాకరించడంతో.. 2001లో సదరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.. అదే సమయంలో బహుదూర్‌పల్లి గ్రామ సర్పంచ్ శివునూరి సుజాత సర్వే నెం.227 ప్రభుత్వ భూమిగా పూర్తి ఆధారాలతో "పిల్" వేయడంతో అక్రమార్కులకు ఇబ్బందిగా తయారైంది.. దాదాపు ఏడాది అనంతరం సదరు భూ వివాదం రెవెన్యూ సంబంధిత సమాచారం అయినందున పూర్తి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా..! అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌కి డైరెక్షన్ ఇస్తూ, హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.. అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌ సుదీర్ఘ విచారణ అనంతరం 2009 సెప్టెంబర్ 9న సర్వే నెంబర్ 227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే నిర్ధారించి, ప్రొసీడింగ్ జారీచేశారు.. దీంతో భయాందోళన చెందిన సాయినాథ్ సొసైటీ సభ్యులు అప్పటికే నిర్మించిన కొన్ని కట్టడాలు కూల్చి వేయకుండా కాపాడుకునేందుకు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో తీసుకున్నారు.. అప్పటి నుండి 227 ప్రభుత్వ భూమి యధాస్థితిని కొనసాగిస్తూ హైకోర్టు పరిధిలోనే ఉంది.. అయినప్పటికీ 2022 డిసెంబర్ 20 నుండి 2023 అక్టోబర్ వరకు రెవెన్యూ అధికారులు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లతో ధారాదత్తం చేశారు.. 2024 జనవరి 8న హైకోర్టు ఆర్డర్‌లతో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో యధేచ్చగా రిజిస్ట్రేషన్‌‌ల ప్రక్రియ కొనసాగటం గమనార్హం.. పెన్ పవర్ దినపత్రికలో గత రెండున్నర సంవత్సరాలుగా అక్రమ రిజిస్ట్రేషన్‌‌లపై వరుస కథనాలుగా వచ్చినప్పటికీ..! అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సాకుతో కబ్జాదారులకి అధికారులు సహకరించారు.. 
 
నోటీసులు ఇచ్చిన సురేందర్ రెడ్డి షెడ్డుపై చర్యలేవి.?
 
బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో కబ్జాదారులకే రెవెన్యూ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారి అండ ఉన్నందునే,స్థానిక తహశీల్దార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.. 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డుకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని, అందుకే నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్ళినా నేటికీ చర్యలు మాత్రం శూన్యం..
231120242
 
కంటైనర్‌లతో ప్రభుత్వ భూమి ఆక్రమణ..
 
బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో  ఎక్కడికక్కడ కబ్జాల పరంపర కొనసాగుతుంది.. సంబంధిత సర్వే నెంబర్ మొత్తం 353.35 ఎకరాలు ఓవైపు ప్రభుత్వ భూమిగా గత 20 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉంది.. 2009లో అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ ఐఏఎస్ సర్కారు భూమిగా నిర్ధారించి ప్రొసీడింగ్ జారీచేశారు.. 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలుగా పేర్కొంటూ, అక్రమ షెడ్డుకు 2024 మే 7న నోటీసులు జారీచేసిన దుండిగల్‌ తహశీల్దార్ మతీన్, కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నట్లు, చర్యలు తీసుకోని ఎమ్మార్వో విధులతో స్పష్టమవుతుంది.. అక్రమ సీసీరోడ్డు సంగతి తెలిసిందే.. జిల్లా అధికారి అండతో కబ్జాదారులకి సీసీరోడ్డు వేశారు..ముగ్గురు కలెక్టర్‌ల హయాంలో ధరణీ రిజిస్ట్రేషన్‌‌లపై, ఎలాంటి చర్యలు లేకపోవడంతో..!బౌరంపేట్ రోడ్డులో 227 సర్కారీ జమీన్‌లో కంటైనర్‌లతో బరితెగించి కబ్జాలకు పాల్పడుతుంటే..! చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో శ్యామ్‌ప్రకాష్ చర్యలకు ఆదేశించి నప్పటికీ..! దుండిగల్‌ తహశీల్దార్ బేఖాతర్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.. 
 
దుండిగల్‌ మండలం బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు అధికారులే దగ్గరుండి ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు, సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు చేస్తూనే..! అక్రమ షెడ్లకు ఇచ్చిన నోటీసుల్లో మాత్రం పోరంబోకు భూమిగా పేర్కొంటున్నారు.. నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ చర్యలు మాత్రం తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. నోటీసులు ఇచ్చిన షెడ్డుకు ముడుపులు ముట్టాయని, అందుకే నోటీసులు చిత్తుకాగితంలా భావించి, తహశీల్దార్ చర్యలు తీసుకోవడం లేదని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. బౌరంపేట్ రోడ్డులో కంటైనర్‌లతో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు..

About The Author