మాకవరపాలెంలో టిడిపి కి బిగ్ షాక్
బూరుగుపాలెం సర్పంచ్ సహా 250 టిడిపి కుటుంబాలు వైసిపిలో చేరిక
నర్సీపట్నం, పెన్ పవర్ ( మే 01 ) :3
30 వేల మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నామని నర్సీపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం మాకవరపాలెం మండలం బూరుగుపాలెం సర్పంచ్ వబ్బలరెడ్డి వెంకటరమణ తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిడిపి నాయకుడిగా మండలంలో మంచిపట్టున్న వెంకటరమణ వైసీపీలో చేరడం ఆ పార్టీకి మరింత బలం పెరిగినట్లయింది. పెదబొడ్డేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, సీనియర్ వైసీపీ నాయకులు రుత్తల యర్రాపాత్రుడు, చింతకాయల సన్యాసిపాత్రుడుల సమక్షంలో బూరుగుపాలెం సర్పంచ్ వెంకటరమణ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా అనుకున్న సమయం ప్రకారం ఉమాశంకర్ గణేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు పంచాయతీలోని 250 కుటుంబాలు వైసీపీలో చేరాయి. వీరందరికీ ఉమాశంకర్ గణేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒక దశలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతూ ఉంటే ఎమ్మెల్యేకి చేతులు పీకాయని అనడంలో అతిశయోక్తి లేదు. ఉత్సాహభరిత వాతావరణంలో అందరూ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ మరో 10 రోజులలో పోలింగ్ జరుగుతుండగా ఈరోజు ఇంతమంది పార్టీలో చేరడం శుభసూచకం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు మరింతగా ముందుకు వెళ్లాలంటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆయనను గెలిపించుకునేందుకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీ పంచాయతీ అభివృద్ధికి ఏది కోరిన చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఉత్సాహం చూస్తుంటే కచ్చితంగా 30 వేల మెజారిటీతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వెంకటరమణ ను పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పగానే సహకరించిన మాకవరపాలెం మండల నాయకులకు, బూరుగుపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో చేరిన వెంకటరమణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, ఉమాశంకర్ గణేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసుకునే వరకు కష్టపడి పని చేస్తామన్నారు.