పార్టీ పిరాయింపుల్లో..! ఆంతర్యం..?

పార్టీ పిరాయింపుల్లో..! ఆంతర్యం..?

అధికారమా..? వ్యక్తిగత స్వార్ధమా..? గోగులపాటి కృష్ణమోహన్ మనోగతం

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేతలు..! ప్రజలకి సేవ చేస్తారా..?

 ఏ పార్టీ అధికారంలో ఉంటే..! ఆ పార్టీలోకి మారడం ఈ తరం నాయకులకు ఆనవాయితీగా మారింది..!

ప్రతిపక్షం లేకుండా చేద్దామని, అప్పుడు బీఆర్ఎస్..! ఇప్పుడు కాంగ్రెస్..!ఒకే ధోరణితో వ్యవహరిస్తోంది..

చేరికలతో సొంత పార్టీ నాయకులను ధిక్కరిస్తూ..! కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారా..?

2014లో కాంగ్రెస్‌ను నామ రూపాలు లేకుండా చేద్దామనే యోచనతో బీఆర్ఎస్ స్కెచ్ ఏమైంది..!

2024లో బీఆర్ఎస్‌ని లేకుండా చేద్దామని కాంగ్రెస్ దిట్టం.. భవిష్యత్తులో ఏం జరగబోతోంది..?

అప్పుడు-ఇప్పుడు ఈ వ్యవహారంలో సొంత పార్టీ నాయకులకు, నమ్ముకున్న క్యాడర్‌కి మోసం..?

ఈసారి చేర్చుకున్న వారికి..! సొంతపార్టీ నేతలను కాదని, వచ్చేసారికి టికెట్ ఇవ్వగలరా..?

ZomboDroid_12072024111235

అధికారంలోకి వచ్చిన పార్టీలు..! సంపూర్ణ మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ..!
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే..! ప్రతిపక్షాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా భావించవచ్చు.. కానీ చరిత్రలో ప్రతిపక్ష పార్టీ పూర్తిగా తుడిచి పెట్టిన దాఖలాలు అంతగా ఉన్నాయా..? ఇక పనైపోయిందన్న పార్టీలు తిరిగి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారం చేజిక్కించుకున్న సంధర్భాలు కూడా మనం తెలుగు రాష్ట్రాలలో తాజాగా చూస్తున్నాం.. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని.‌! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపును మనం ఉదాహరణగా తీసుకోవచ్చు..
అయితే ప్రస్తుతం తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఉంది.. "చెడపకురా  చెడేవు" అన్న నానుడి రెండు రాష్ట్రాల్లో తేటతెల్లం చేసింది.. గతంలో కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను చేర్చుకున్న బీఆర్ఎస్‌కి.. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో గులాబీ నేతలకు అనుభవం వచ్చింది.. రాబోయే కాలంలో కాంగ్రెస్ కూడా చవిచూడబోతోంది అనడంలో అతిశయోక్తి కాదు..!*

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూలై 12:

తెలంగాణ స్వ రాష్ట్ర సాధనతో.. నేతల్లో స్వార్ధం, పెరిగిపోయింది.. నాడు అత్యధిక సీట్లు గెలుపొంది, అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్..! ప్రతిపక్షం  లేకుండా చేద్దామనే ఉద్దేశంతో స్వార్ధ పూరిత నాయకులను పార్టీలో చేర్చుకున్నారు.. నేడు తనకు వచ్చిన మెజార్టీ సీట్లతో ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ..! టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో  చేర్చుకొని ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ధృఢసంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తుంది..   ఇందులో భాగంగానే ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలను కూడా త్వరలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.. చేరికలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.. అప్పుడు, ఇప్పుడు సొంత పార్టీ నేతలు నమ్మకద్రోహానికి తలపెడితే..! ముఖ్యమంత్రి సీటుకు వేటు పడకుండా ముందస్తుగా చేరికలతో తన బలాన్ని పోగుచేసి పెట్టుకుంటున్నారా.‌.? అంటూ సందేహాలను వెలిబుచ్చే వాళ్ళు లేకపోలేదు..! అలాంటి ఘటనలు జరుగకుండా..! కొత్తగా పార్టీలో చేరిన కొత్త ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని అభిప్రాయం కూడస కావచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

చేరికలతో ఎవరికి ప్రయోజనం..? చేర్చుకున్న వారికా..? చేరిన వారికా..?

ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే..!  ప్రతి పార్టీలోనూ ఒక ప్రత్యేకమైన క్యాడర్, నేతలు ఉంటారు.. వాళ్ళు పార్టీనే నమ్ముకుని ఏళ్ల తరబడి నిలకడగా ఉన్నచోట.. వారి అభిప్రాయాన్ని సేకరించకుండానే.. చేరికలు, అలకలు,ఆ తర్వాత బుజ్జగింపులు రోజూ చూస్తూనే ఉన్నాం..! ఇంతవరకు బాగానే ఉంది..! వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ క్యాడర్‌ను వదిలేసి చేరికల నేతలకు సీటు ఇవ్వగలరా..? ఒకవేళ ఇంటి కూర కంటే బయటి కూరే రుచిగా ఉంటుందనే నానుడికి అద్దం పడుతూ.. కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే..! ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకున్న నేతల పరిస్థితి..? ఒకవేళ సొంత పార్టీ నాయకులకే సీట్లు కేటాయిస్తే..! పార్టీని‌ నమ్ముకుని కండువా కప్పుకున్న వారి పరిస్థితి..? ఒక సీటుకు రెండు వైపులా న్యాయం చేయగలరా..? అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది..!ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది..? ఎందుకంటే... చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యంగా పార్టీలు మారుతున్నామని చెబుతున్నప్పటికీ.. గతంలో గాని ప్రస్తుతం కానీ ఆయా నియోజకవర్గాలలో ఎంత మాత్రం అభివృద్ధి జరిగిందో మనం గమనించవచ్చు..

ఆస్తులు కాపాడుకునేందుకే అంటూ విమర్శలు..!

 ప్రతిపక్షం ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి ప్రధాన కారణాలు విశ్లేషిస్తే... కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన భూకబ్జాలు, అవినీతి భాగోతాల నుండి రక్షించబడేందుకు, ఆస్తులు కాపాడుకునేందుకు అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శలు వస్తున్నాయి.. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యేలుగా పార్టీలు మారిన వారికి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం లేదు. ఉన్న అధికార పార్టీలోనే సీనియర్లు చాలామంది మంత్రి పదవులు రాక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కొత్తగా పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇస్తే సీనియర్లతో ఎదురు దాడులు తప్పవు అన్న విషయం అందరికీ తెలిసిందే..! మరి అధికారికంగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పార్టీలు మారడానికి మరొక కారణం పెద్దమొత్తంలో డబ్బులు ఎరజూపడమేనని ఆరోపణలు ఉన్నాయి..

ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడితే నష్టమేముంది..?

ఇక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరితే బీఆరెస్ పార్టీకి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ ఎన్నికలలో ఓటింగ్ శాతంలో రెండు శాతం మాత్రమే తేడా ఉంది. అదే మహానగరంలో మంచి ఊపు మీద ఉన్న బిఆర్ఎస్..! గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వెనకబడిందని చెప్పవచ్చు కానీ ఈ తేడా ఎక్కువ కాలం ఉండదు.. అధికార పార్టీ చేసే తప్పులతో, ప్రతిపక్షం పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం.. అధికార పార్టీపై వ్యతిరేకత అనేది ఎప్పటికీ ఉండనే ఉంటుంది. అది ఏ పార్టీ ఉన్నా ఆ మాత్రం వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.. తెలంగాణ తెచ్చిన పార్టీగా బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఇప్పటికీ ఎక్కడో ఒకచోట అభిమానం అనేది అలాగే ఉందని చెప్పవచ్చు. కాబట్టి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు  భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టపోతారని అనిపిస్తుంది.. ఆయా నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల్లో ఉన్న సీటు సీనియర్లకు కాదని సిటింగులకు ఇస్తారనే నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆ తరువాత గెలిచినా..! మరో అధికార పార్టీలోకి వెళ్ళరని గ్యారంటీ లేదు కాబట్టి..

బిఆర్ఎస్ అధినాయకత్వంలో మార్పులు అనివార్యం..

ఇకపోతే బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంలో మార్పులు అనివార్యమనిపిస్తుంది, ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన నాయకులు చెప్పే కారణాలు చూస్తే ఆ పార్టీ (బీఆర్ఎస్ పార్టీ) లో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదని, తమ అధినేతను కలుసుకునే అవకాశం కూడా ఉండదనే వాదనలు, కాదు వేదనలు అంటూ వ్యంగ్యంగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధినాయకత్వం తమ పార్టీ నాయకులకు వ్యక్తిగతంగా కనీసం మూడు నెలలకు ఒకసారైనా తగినంత సమయం కేటాయించాలి, పార్టీ కింది స్థాయి నాయకులతో ఆరు నెలలకొకసారి సమావేశాలు నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వీరుల కుటుంబాలను గుర్తించి ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలి. అవినీతికి, చరమగీతం పాడి అవినీతి పరులపై పోరాటానికి నాంది పలకాలి, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమవ్వాలి..

*ఏది ఏమైనప్పటికీ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు.. ప్రజా నిర్ణయాన్ని కాదని, వారి ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం ఏదో ఒకరోజు ఎదురు తిరిగే సమయం వస్తుంది.. ఎమ్మెల్యేలు వ్యక్తిగత స్వార్ధాల కోసం ప్రజల అభిమానాన్ని తాకట్టు పెడుతున్నారని అనిపిస్తుంది.ఏదిఏమైనా తగిన మూల్యం చెల్లించుకోక మానరు. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది..*

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts