మెట్టగూడ లో పాఠశాల మంజూరు చెయ్యాలి: సర్పంచ్, కోర్ర త్రినాథ్
👉మెట్టగూడ విద్యార్ధులకు వర్షం పడితే పాఠశాల బంధ్
👉విద్యార్థులు ప్రాణాలు తెగించి గెడ్డ దాటుతున్న పరిస్థితి
👉గ్రామంలో పాఠశాలలేక రోజు 3 కిలోమీటర్లు నడుస్తున్న విద్యార్థులు.
👉గత ఐటిడిఏ పీఓ వినయ్ చంధ్ ఏర్పాటు చేసిన పాఠశాల మరల కొనసాగించాలి.
👉పాఠశాల మంజూరుకు గతంలో ఐటిడిఏ స్పందనలో పెడితే కనీస స్పందనే లేదు.
👉పాఠశాల ఏర్పాటుకు లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాధ్ డిమాండ్.
(స్టాఫ్ రిపోర్టర్,మాదిరి చంటిబాబు)పాడేరు/ గూడెం కొత్త వీధి,ముంచంగిపుట్టు,పెన్ పవర్, జూలై 14:వర్షం పడితే చాలు ఆ గ్రామ విద్యార్థులకు పాఠశాల బంద్. తప్పని పరిస్థితుల్లో పాఠశాలకు వెళ్లాలంటే ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని మూడు కిలోమీటర్లు వేరే గ్రామ పాఠశాలకు వెళ్లి రావాల్సిన పరిస్థితి. గతంలో ఆ గ్రామానికి పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వినయ్ తాత్కలిక పాఠశాల ఎన్ ఆర్ ఎస్ టి సి మంజూరు చేసినప్పటికీ తదుపరి కాలంలో వాటిని ఎత్తేసిన వైనం. గత ప్రభుత్వంలో పాడేరు ఐటిడిఏ స్పందన కార్యక్రమంలో ఈ పాఠశాల విషయమై వినతి పత్రం అందజేసిన కనీస స్పందన లేని పరిస్థితి నెలకొందని పంచాయతీ సర్పంచ్ ఆవేదన. వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాల కెళ్ళి వచ్చేంత వరకు ఏం జరుగుతాదో అని భయం గుప్పెట్లో విద్యార్థుల తల్లి దండ్రులు. శనివారం పంచాయతీ సర్పంచ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాత్రికేయులకు తెలిపిన వివరాల ప్రకారం... అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం, లక్ష్మీపురం గ్రామ పంచాయితీ, మెట్టగూడ గ్రామం నుండి సుమారు 14 మంది విద్యార్థులు పక్క గ్రామమైన లక్ష్మీపురం పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇరువైపులా సుమారు మూడు కిలోమీటర్లు నడిచి మార్గమధ్యంలో పారె గెడ్డ దాటి రాకపోకలు నిత్యము కొనసాగిస్తుంటారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ మెట్టగూడలో పాఠశాల లేకపోవడంతో 14 మంది విద్యార్థులు రెండు వైపులా మూడు కిలో మీటర్లు దూరంలో ఉన్న లక్ష్మీపురం ఎంపిపి పాఠశాలలో కాలినడకన ఘాటి రహదారిలో వచ్చి చదువుతున్నారని, ఈ ఘాటి ఎక్కడమే కాకుండా ఈ గ్రామాల మధ్య పెద్ద పారె గెడ్డ ఉందనీ, వర్షాకాలంలో గెడ్డ దాటాలంటే చాల కష్టంగా ఉంటుందన్నారు. వర్షాకాలం ప్రమాదకరస్థాయిలో ఈ గెడ్డ వరద ఉధృతికి వాగు పొంగి ప్రవహిస్తుంటాయి అన్నారు. ఈ మార్గంలో విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగించడం ప్రమాదకరం కావడంతో వర్షాకాలంలో విద్యార్థులు వరద ఉద్ధృతి తగ్గేంత వరకు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. గతంలో తాను వైస్ ఎంపీపీ గా ఉన్న సమయంలో పాడేరు ఐటిడిఏ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో మెట్టగూడలో పాఠశాల మంజూరు చేయాలని అప్పటి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పని చేసిన వినయ్ చంద్ కు వినతి పత్రం అందజేయగా స్పందించిన అప్పటి ప్రాజెక్టు అధికారి ఒక సంవత్సరం పాటు ఎన్ ఆర్ ఎస్ టి సి తాత్కలికంగా పాఠశాల ఏర్పాటు చేశారని, అది మరల కొనసాగించి ఉంటే ఈ విద్యార్దులకు ఇన్ని కష్టాలు ఉండేది కాదన్నారు. అప్పట్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లక్ష్మీపురం పంచాయతీలో నాలుగు గ్రామాలకు మొంజాగూడ, మెట్టగూడ, లక్ష్మీపురం, దొరగూడ గ్రామాలకు ఎన్ ఆర్ ఎస్ టి సి పాఠశాలలు మంజూరు చేశారని అయితే ఇప్పటికి లక్ష్మీపురం ఎంపిపి పాఠశాల, దొరగూడ ఎంపిపి పాఠశాల రెగ్యులర్ పాఠశాలగా కొనసాగుతుందని, మెట్టగూడ, మొంజాగూడ పాఠశాలలు ఎత్తివేశారన్నారు. మెట్టగూడలో కూడ పాఠశాల కొనసాగించి ఉంటే బాగుండేదని, ఇప్పుడు విద్యార్థులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఈ పాఠశాలల విషయమై గత వైసిపి ప్రభుత్వం హయంలో కూడ పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఐటిడిఏ పాడేరులో స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేసిన కనీస స్పందన లేకుండా పోయిందన్నారు. ఈ కొత్త ప్రభుత్వం అయిన స్పందించి విద్యార్థుల కష్టానీ గుర్తించి మెట్టగూడ గ్రామాంలో పాఠశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై వ్రాతపూర్వకంగా మీ కోసం కార్యక్రమంలో పిర్యాదు చేస్తానని చెప్పారు. మెట్టగూడ పాఠశాల విషయమై విద్యాశాఖ లక్ష్మీపురం సిఆర్పి గడుతుల ఈశ్వరరావుకు వివరణ కోరగా..గతంలో ఎన్ ఆర్ ఎస్ టి సి క్రింద తాత్కాలికంగా పాఠశాల కొనసాగిందని, ఎన్ ఆర్ ఎస్ టి సి పాఠశాల కొనసాగాలంటే తప్పకుండా 20 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన ఉందని, అయినప్పటికీ మెట్టగూడ పాఠశాల విషయము సర్వే చేసి నివేదికను అధికారులకు అందజేస్తామన్నారు. మెట్టగూడలో పాఠశాల ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తమ గ్రామంలో పాఠశాల మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మర్రి సిబో, వంతాల లుక్ నాథ్, వంతాల సాదురాం,గిర్లియ బుద్ధు, కొర్ర సద్దు,వంతాల గోపాల్ తదితరులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.