"హైడ్రా" పవర్ తగ్గిందా..? చెరువుల మరమ్మతులకే పరిమితమా..?

 125 ఏళ్ళ ఫాక్స్‌సాగర్ నాలపై..! అక్రమ నిర్మాణం చర్యల కథ కంచికేనా..?

 "హైడ్రా" చర్యలు సన్నగిల్లాయా..? ఇకపై చెరువుల మరమ్మతులకే పరిమితమా..?
 ఫాక్స్‌సాగర్ నాలాపై అక్రమ కట్టడాన్ని సీజ్ చేసినప్పటికీ..! బయట తాళం లోపల పనులు..!
 హైడ్రా దృష్టికి తీసుకెళ్తామన్న "నార్త్ ట్యాంక్ డివిజన్" ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ..

కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారుల సౌజన్యంతో ఫాక్స్‌సాగర్ నాలా ఆక్రమణ..

1897-99 కాలం నాటి ఫాక్స్‌సాగర్ చారిత్రక ఆనవాళ్లు చెరిపేస్తున్న కబ్జాదారులు..

గతంలో "తిరుమల హైట్స్" అపార్ట్‌మెంట్‌కి సహకరించిన జీహెచ్ఎంసి..

సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్‌సాగర్ చెరువును బ్రిటిష్ కాలంలో నిర్మితమైంది..

అలుగు,సర్‌ప్లస్ వాటర్ మూసీనదిలో కలిపే ఈ చారిత్రక నాలాపై భారీ అక్రమ నిర్మాణాలు.. 

125 ఏళ్ళనాటి చారిత్రక ఫాక్స్‌సాగర్ నాలా ఇపుడు కనుమరుగు అవుతుంది.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే ఫాక్స్‌సాగర్ నాలా బఫర్‌లో కొందరు నేతల సిఫార్సులతో "తిరుమల హైట్స్" అపార్ట్‌మెంట్‌ నిర్మించారు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకంగా నాలాపైనే ఓ మార్వాడీ పలుకుబడితో భారీ నిర్మాణం చేపట్టడం విశేషం.. ప్రభుత్వాలు మారినా చెరువులు కుంటలు, చారిత్రక చెరువు నాలాలు కబ్జాకు గురికావడం కామన్ అయిపోయింది.. జీహెచ్ఎంసి అధికారుల చేతివాటానికి ఇదో నిదర్శనంగా చెప్పవచ్చు.. గత ఆగష్టు 16న అప్పటి సర్కిల్-25 ఏసిపి సాయిబాబా,టిపిఎస్ ప్రభావతి ఆధ్వర్యంలో సీజ్ చేశారు.. ఆతర్వాత మళ్ళీ పనులు ఎందుకు కొనసాగున్నాయి..? సంబంధిత అధికారుల చర్యలు సీజింగ్‌లు, నోటీసులు పేరుతో పేపర్‌లకే పరిమితమా..? మరోవైపు సదరు నిర్మాణ దారులు కోర్టు నుండి జీహెచ్ఎంసి జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఉన్నట్లు సమాచారంలో నిజమెంత..? ప్రస్తుత నాలాపై నిర్మాణానికి, ఎదురుగా ఉన్న.. "తిరుమల హైట్స్" బిల్డర్స్‌.. 2018లో ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసి ఇచ్చిన సర్వే స్కెచ్‌మ్యాప్‌లో "నాలా వెడల్పు 30 మీటర్లు (100 ఫీట్లు) రెండు వైపులా 9 మీటర్లు (30 ఫీట్ల) బఫర్ జోన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.. మరి అధికారుల చర్యలు మాత్రం మొక్కుబడిగా సీజ్ చేసి వదిలేశారు..

 

మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, నవంబర్ 29:

 

ఓవైపు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆదేశాలు..! మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా ఏర్పాటు చేసినప్పటికీ..! సంబంధిత అధికారులు చెరువులను, చారిత్రక నాలాలను కాపాడలేక పోవడం దురదృష్టకరం.. 1897-99 కాలంలో నిర్మించిన 125 ఏళ్ళ చారిత్రక కట్టడం ఫాక్స్‌సాగర్ చెరువును, సర్‌ప్లస్ వాటర్‌ను మూసీనదిలో కలిపే భారీ నాలాపై అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసి అధికారులే ప్రోత్సహిస్తున్నారని అనడంలో అతిశయోక్తి లేదు.. అక్రమ నిర్మాణాలు అంటే చర్యలు ఏమోకానీ..! బిల్డర్‌ను కలవమని అధికారులే సూచించడం పరిపాటిగా మారింది.. ఈ వ్యవహారం జీహెచ్ఎంసి, మున్సిపాలిటీలలో విపరీతంగా సాగుతున్న దందాగా పలువురు విమర్శలు చేస్తున్నారు.. కుత్బుల్లాపూర్ సర్కిల్-25 పరిధిలోని సుచిత్ర రోడ్డులో కొందరు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఫాక్స్‌సాగర్ నాలాపై" "తిరుమల హైట్స్" గత ప్రభుత్వ హయాంలో జ్ఞాపకార్థంగానూ..! నేటికీ చర్యలకు దూరంగానూ ఉన్నది చూడవచ్చు.. సుమారు రెండేళ్ళుగా వార్తలు వస్తున్నా జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ఇచ్చిన "తప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌‌"కే సంబంధిత అధికారులు న్యాయం చేస్తున్నారు..

ఫాక్స్‌సాగర్ నాలాపై మరో భారీ అక్రమ కట్టడం..

కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 పరిధిలోని సుచిత్రా వెళ్ళే దారిలోని ఫాక్స్‌సాగర్ నాలా అధికారుల నిర్లక్ష్యంతో కుంచించుకు పోతోంది.. ఇప్పటికే "తిరుమల హైట్స్" అపార్ట్‌మెంట్‌కు సహకరించిన జీహెచ్ఎంసి అధికారులు..! ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఫాక్స్‌సాగర్ నాలాపై ఏడాదిగా నిర్మిస్తున్న మరో భారీ అపార్ట్‌మెంట్‌కు అధికారులు సహకరించడం గమనార్హం.. పత్రికల్లో వార్తలు వస్తేనే అధికారుల దృష్టికి వచ్చినట్టు వ్యవహరించిన, జీహెచ్ఎంసి సర్కిల్-25 టౌన్‌ప్లానింగ్, అధికారులు గత ఆగష్టు 16న సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు.. ఆతర్వాత సదరు‌ బిల్డర్ యధేచ్చగా పనులు చేస్తున్నప్పటికీ సైలెంట్‌గా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.. అధికారుల అలసత్వంతో చారిత్రక ఆనావాళ్ళు చెరిపివేతకు గురవుతున్నాయి.. చెరువులు, నాలాల పరిరక్షణ రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసి సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన మూడు శాఖలు సహకరించడం విశేషం..

బయట తాళం.. లోపల పనులు..

ఫాక్స్‌సాగర్ నాలాపై గత ఆగష్టు 16న సీజ్ చేసిన అక్రమ కట్టడంలో నిర్మాణ దారులు తెలివిగా పనులు చేపడుతున్నారు.. సుచిత్ర రోడ్డు వైపు తాళం వేసి, దొడ్డి దారిలో పనులు చేస్తున్నారు.. వేసిన తాళం అలాగే ఉంటుంది.. నిర్మాణం మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతుంది.. అధికారుల దృష్టిలో లేదంటే నమ్మవచ్చా..? సర్కిల్-25 టౌన్‌ప్లానింగ్ అధికారి ఏసిపి సురేందర్ దృష్టికి తీసుకెళ్ళగా, తనకి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారని..! ఈ విషయాన్ని తమ టిపిఎస్‌కి ఆదేశించనున్నట్లు తెలిపారు.. నాలా ఆక్రమణలపై లిస్టుని హైడ్రాకి నివేదిక సమర్పించినట్లు కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 అసిస్టెంట్ సిటీ ప్లానర్ సురేందర్ తెలిపారు..

నాలాపై అక్రమ కట్టడాన్ని.. హైడ్రాకి ఇరిగేషన్ లేఖ..

ఫాక్స్‌సాగర్ నాలాపై అక్రమ నిర్మాణం విషయాన్ని "నార్త్ ట్యాంక్ డివిజన్" ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణతో ప్రస్తావించగా.. తమ నీటిపారుదల శాఖ, డీఈని పరిశీలనుకు ఆదేశించినట్లు తెలిపారు.. గతంలోనే హైడ్రా కమిషనర్‌కి లెటరు రాసినట్లు ఈఈ పేర్కొన్నారు.. అయితే తాజాగా పనులు యధావిధిగా కొనసాగటంపై ఈఈ నారాయణ దృష్టికి తీసుకెళ్ళగా..! హైడ్రా కమిషనర్‌కి మరోసారి లేఖ రాయనున్నట్లు "పెన్ పవర్" ప్రతినిధితో తెలిపారు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన "ఆపరేషన్ హైడ్రా" చర్యలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.. అట్టహాసంగా హైడ్రా ఉనికిన పరిచయం చేసిన తెలంగాణ సర్కార్ ఒక్కసారిగా వెనక్కి తగ్గడానికి కారణం ఏదైనా..! తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ప్రధానంగా బెంగుళూరు నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా సుప్రీంకోర్టు కూడా చెరువులు, నాలాల ఆక్రమణలపై సీరియస్‌గానే ఉంది.. హైడ్రా కమిషనర్ ఏ.వి రంగానాథ్ ఐపీఎస్ చర్యల్లో కఠినంగానే వ్యవహరించారు.. ఎంతైనా ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు వినాల్సిందే కదా..! హైడ్రా పవర్ తగ్గిందా..? కావాలనే కొన్ని తగ్గించారా..? కుదేలైన రియల్ ఎస్టేట్‌కి ప్రభుత్వం వెనుకడుగు వేసిందా..? చెరువుల్లో కట్టడాలు, నాలాలపై నిర్మాణాలు యధేచ్చగా పనులు కొనసాగటం దేనికి నిదర్శనం..? హైడ్రా సన్నగిల్లిందని వస్తున్న ఆరోపణలకు, ఫాక్స్‌సాగర్ లాంటి చారిత్రక నాలాపై కబ్జాలను సీజ్ చేసి వదిలేయడం మొక్కుబడి చర్యలుగా పరిగణలోకి తీసుకోవాలా..? అటు హైడ్రా కమిషనర్, ఇటు కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారులు, నార్త్ ట్యాంక్ డివిజన్ నీటిపారుదల శాఖ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూద్దాం..

About The Author